ఇప్పటికే ఏడాది కిందట నియోజకవర్గాల ఇంచార్జ్‌లుగా చంద్రబాబు నియమించిన వారిని ఎన్నికలకు ముందు వద్దంటూ.. కొందరు హడావుడి చేస్తున్నారు. అయితే.. ఈ రగడ కారణంగా.. పార్టీకే నష్టమని.. పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం గోపాలపురం. ఇది ఎస్సీల నియోజకవర్గాల్లోనే టీడీపీకి బలమైన కంచుకోట. ఎంతగా అంటే.. 1983లో టీడీపీ పెట్టాక.. అప్పటి నుంచి 1999 వరకు అంటే.. 5 ఎన్నికల్లో టీడీపీ వరుస విజయాలు నాన్ స్టాప్‌గా సాధించింది. ఆ తర్వాత 2004లో ఒక్క సారి ఓడిపోయినా.. 2009, 2014 ఎన్నికల్లో మళ్లీ వరుస విజయాలు దక్కించుకుని ఈ సీటును టీడీపీ తన ఖాతాలో వేసుకుంది. మొత్తంగా చూస్తే.. టీడీపీ ఆవిర్భవించిన తర్వాత.. ఎస్సీ నియోజకవర్గాల్లో ఈ రేంజ్‌లో గెలిచిన నియోజకవర్గం ఇదొక్కటే.
గోపాలపురం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ పాగా వేసింది. తలారి వెంకట్రావు ఇక్కడ నుంచి విజయం దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో వెంకట్రావుకు దీటుగా ఉండేలా.. చంద్రబాబు.. మద్దిపాటి వెంకట్రాజును ఇక్కడ ఇంచార్జ్‌గా నియమించారు. ఉన్నత విద్యావంతుడు.. దూకుడు స్వభావం ఉన్న వ్యక్తి కావడంతో గెలుపు తథ్యమని భావించారు. అయితే.. మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకట్రావు.. ఈ సీటుపై కన్నేశారు. తనకు కేటాయించాలన్న డిమాండ్‌ను ఆయన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో పార్టీలో చిచ్చు పెడుతున్నారనే వాదన వినిపిస్తోంది. మద్దిపాటి వెంకట్రాజుతో తాము వేగలేక పోతున్నామని.. ఆయన నియంతగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ.. అగ్రవర్ణ నాయకులను వెంటేసుకు ని, 30 పేజీలతో కూడిన ఫిర్యాదును పార్టీ అదిష్టానానికి అందజేశారు. మరోవైపు మద్దిపాటి మాత్రం.. తన పనితాను చేసుకు పోతున్నారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 27న నియోజకవర్గంలో నిర్వహించనున్నరా.. కదలిరా! సభకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే.. మరోవైపు ఆయనకు సహకరించకుండా.. తమ్ముళ్లు మాత్రం గోల గోల చేస్తున్నారు. దీంతో మరోసారి ఇక్కడ వైసీపీ పుంజుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.