ముస్లిం రిజర్వేషన్ వివాదం : బీజేపీ చెలగాటం వెనక ..?


ఈసారి ఎన్నికల్లో భావోద్వేగమైన అంశాలు అయితే ఏవీ లేవు. రామమందిరం పూర్తి చేసిన బీజేపీకి హిందూత్వ నినాదం కలసి వస్తుందని అంచనా వేసుకుంది. కానీ అది సరిపోవడం లేదు అని గ్రహించింది. ఇవన్నీ ఇలా ఉంటే సడెన్ గా బీజేపీ ముస్లిం రిజర్వేషన్ల నినాదం ఎత్తుకుంది. మత పరమైన రిజర్వేషన్లు దేశానికి మంచిది కాదు వాటిని ఎత్తి వేస్తామని బీజేపీ పెద్దలు చెబుతున్నారు. అలాగే తాము అధికారంలోకి మరోసారి వస్తే కనుక కీలక అంశాలలో నిర్ణయం తీసుకుంటామని బీజేపీ పెద్దలు చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అయితే కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తున్నారు. మత పరమైన రిజర్వేషన్లు ఇవ్వడం కోసం మూడున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్ చూస్తోంది అన్నారు. 


దాని ఫలితాలూ పర్యవసానాలు ఏవీ చూసుకోకుండా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 27 శాతం ఉండే ఓబీసీ రిజర్వేషన్లలో కూడా చీలిక తెచ్చి ముస్లింలకు ఇవ్వాలని చూసిందని అన్నారు. ఉమ్మడి ఏపీలో తెచ్చిన ముస్లిం రిజర్వేషన్లను హైకోర్టు కొట్టేసిందని ఆయన గుర్తు చేశారు. ఆ మీదట సుప్రీం కోర్టులో సైతం పరిష్కారం దొరకలేదని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన మరో మాట అన్నారు. ఒక ముఖ్యమైన వర్గం రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తూంటే మతపరమైన రిజర్వేషన్లు ఎలా ఇస్తారని. ఈ విధంగా గుర్తు చేయడం ద్వారా ఆయన బీసీలూ ఓబీసీల మద్దతు కోసం ప్రయత్నం చేస్తున్నారు అదే విధంగా ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించడం ద్వారా హిందూత్వకు మరింత ఊతం ఇవ్వాలని చూస్తున్నారు. 

కాంగ్రెస్ ని కార్నర్ చేయడానికి కూడా బీజేపీ పెద్దలు మోడీ ప్రయత్నం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా దేశంలో ఇదే అంశం మీద చర్చ సాగుతోంది. ఇది సున్నితమైన అంశం. పైగా దేశ జనాభాలో పెద్ద సంఖ్యలో ఉన్న బీసీలను ఓబీసీలను బీజేపీ ఈ విధంగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అదే విధంగా మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకం అని కూడా అంటోంది. ఈ రోజున దేశంలో యాభై శాతం మించి రిజర్వేషన్లు ఉండరాదు అన్నది సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు. అందులో నాలుగు శాతం ముస్లిం సామాజికి ఇస్తున్నారు అని దానిని రద్దు చేస్తామని బీజేపీ అంటోంది. అలా రద్దు చేసిన దానిని బీసీలకు ఇవ్వాలని ఆ పార్టీ చూస్తోంది. ఇక్కడ ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా బీసీ మంత్రంతో పాటు హిందూత్వ వ్యూహం అనుసరిస్తోంది. 

బీజేపీ వరకూ ఇది బాగానే ఉన్నా ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న ఇతర పార్టీలకు చెలగాటంగానే ఉంది అని అంటున్నారు. ఏపీ వరకూ చూస్తే తెలుగుదేశం దీనికి జవాబు చెప్పుకోలేక నలిగిపోతోంది. ముస్లిం రిజర్వేషన్లు రద్దుకు వ్యతిరేకమని గట్టిగా చెప్పలేకపోతోంది. వారి ప్రయోజనాలను కాపాడుతామని అంటున్నా ఎలా కాపాడుతారు అన్న దానికి జవాబు లేదని అంటున్నారు. బీజేపీ జాతీయ పార్టీ ఒకసారి దేశ స్థాయిలో నిర్ణయం తీసుకుంటే అన్ని రాష్ట్రాలకు వరిస్తుంది. రాజ్యాంగం ప్రకారం ఇలా చేస్తున్నామని కూడా చెబుతోంది. అపుడు టీడీపీ చేయాల్సిన పని బీజేపీకి మిగిలిన పార్టీల మాదిరిగా వ్యతిరేకించడమే. కానీ బీజేపీతో పొత్తుల ఉన్న టీడీపీకి అది సాధ్యపడదు. మరో వైపు వైసీపీ ఇదే విషయం మీద టీడీపీని ఎండగడుతోంది. ఏది ఏమైనా బీజేపీకి చెలగాటంగా ఉంది. పొత్తు పార్టీలకు ప్రాణ సంకటం ఈ సున్నితమైన అంశాలు మారాయని అంటున్నారు.