రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నా.. రెండే రెండు నియోజకవర్గాలు మాత్రం ఆసక్తిగా మారాయి. అవే పిఠాపురం-మంగళగిరి. ఈ రెండు నియోజకవర్గాల గురించే ఎక్కడ ఏ ఇద్దరు కలుసుకున్నా మాట్లాడుతున్నారు. ఇక, ఈ రెండు నియోజకవర్గాలు ఇంత హాట్ టాపిక్‌గా మారేందుకు కారణం.. అందరికీ తెలిసిందే. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఇక, మంగళగిరి నుంచి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ వరుసగా రెండో సారి బరిలోకి దిగారు.
ఇక, ఈ ఇద్దరు నేతలు కూడా.. గత 2019 ఎన్నికల్లో ఓడిపోయిన వారే కావడం గమనార్హం. అయినప్పటికీ.. పార్టీలను నడిపిస్తున్నారు. పవన్ తన సొంత పార్టీ జనసేనను ముందుండి నడిపిస్తుండగా.. నారా లోకేష్ టీడీపీలో నెంబర్ 2 పొజిషన్‌లో ఉన్నారు. దీంతో ఇప్పుడు వీరికి గెలుపు అనివార్యంగా మారింది. అయితే.. వీరి గెలుపు అనుకున్నంత ఈజీ కాదు. ప్రత్యర్థి, అధికార పార్టీ వైసీపీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. అనేక సమీకరణల తర్వాత.. ఈ రెండు నియోజవర్గాల్లోనూ బలమైన నాయకులను దింపింది.
వారు కూడా మహిళా నాయకులే కావడం గమనార్హం. పిఠాపురం నుంచి కాపు నాయకురాలు.. ఎంపీ వంగా గీత బరిలో నిలిచారు. ఇక, మంగళగిరి నుంచి రెండు బలమైన కుటుంబాలకు చెందిన మురుగుడు లావణ్యను రంగంలోకి దింపారు. ఇక, వీరి గెలుపు కోసం.. వైసీపీ నిరంతరం సమీక్షలు చేస్తోంది. కనీసం పదినిమిషాలు కూడా.. అభ్యర్థులను నిద్రపోనివ్వడం లేదంటే ఆశ్చర్యం వేస్తుంది. కానీ, ఇది నిజం. అయితే.. ఇక్కడ వైసీపీ గెలుపు కూడా నల్లేరుపై నడకేమీ కాదు. చాలా కష్టపడుతున్నారు.
అటు పిఠాపురంలో పవన్ వర్సెస్ గీత అయినా.. ఇటు మంగళగిరిలో నారా లోకేష్ వర్సెస్ మురుగుడు లావణ్య అయినా.. చెమట చిందించాల్సిందే. అదే చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ ఒకింత వెనుకబడ్డారనే వాదన ఉన్నా.. మరో 30 రోజుల వరకు ప్రచారం చేసుకునే ఉన్న నేపథ్యంలో ఆయన పుంజుకుంటారనే వాదన ఉంది. కానీ.. పోటీ మాత్రం ఈ రెండు నియోజకవ ర్గాల్లో చాలా చాలా బలంగా ఉందనేది వాస్తవం. పిఠాపురంలో వైసీపీ నలుగురు కీలక నేతలను రంగంలొకి దింపింది.
ఈ పరిస్థితి జనసేనలోకనిపించడం లేదు. కేవలం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మపైనే ఆధారపడ్డారు. ఈయన గత ఎన్నికల్లో ఓడిపోయారు. పైగా క్షత్రియ సామాజికవ ర్గంలో చీలిక వచ్చి.. నానా తిప్పలు పడుతున్నారు. ఇక, మంగళగిరిలోనూ వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, బీసీ నేతటికెట్ ఇచ్చి కూడా వెనక్కి తీసుకున్న గంజి చిరంజీవి, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పనిచేస్తున్నారు. దీంతో ఎవరు గెలిచారా? ఓడారా? అనేది పక్కన పెడితే.. ఇప్పటి వరకు ఈ రెండు నియోజకవర్గాల్లో ఎవరూ కష్టపడని రీతిలో అయితే.. చెమటలు చిందిస్తున్నారు. మరి ప్రజా తీర్పు ఎలా వస్తుందో చూడాలి.