'రెడ్ బుక్ ఇంకా తెరవనేలేదు' జగన్ పై లోకేష్ సెటైర్లు!


Red Book: ఇప్పుడు రెడ్ బుక్ అనేది ఏపీలో అత్యంత చర్చనీయాంశం గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో "రెడ్ బుక్" అనే అంశం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయని.. భయానక వాతావరణం నెలకొందని.. అందుకు కారణం లోకేష్ రెడ్ బుక్ అని జగన్ ఏపీ నుంచి ఢిల్లీ వరకూ చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లోకేష్ స్పందించారు. ఇంకా రెడ్ బుక్ తెరవనేలేదని అన్నారు!


అవును.. ఇప్పుడు రెడ్ బుక్ అనేది ఏపీలో అత్యంత చర్చనీయాంశం గా మారిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, హత్యలు, ఘోరాలు, దారుణాలకు అదే కారణం అని జగన్ చెబుతున్నారు. ఈ సమయంలో తాజాగా అసెంబ్లీ లాబీల్లో ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఈ సందర్భంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ పై సెటైర్లు వేశారు. జగన్ అసెంబ్లీకి వస్తే వాస్తవాలు చెబుతామని అన్నారు.

రెడ్ బుక్ పై జగన్ చేస్తున్న విమర్శలు, ఆరోపణలపై స్పందించిన నారా లోకేష్... గత ఐదేళ్ల కాలంలో రెండే ప్రెస్ మీట్లు పెట్టిన జగన్.. 11 సీట్లు వచ్చేసరికి వరుస ప్రెస్ మీట్లు పెడుతున్నారని అన్నారు. ఇక జగన్ చెప్పే అసత్యాలేవో అసెంబ్లీకి వచ్చి చెబితే.. అసలు సత్యాలేమిటో తాము వివరిస్తామని.. ఆయన్ని గౌరవంగా చూసుకుని వాస్తవాలు అర్ధమయ్యేలా వివరిస్తామని తెలిపారు.

ఈ నేపథ్యంలోనే రెడ్ బుక్ ప్రస్థావన తెచ్చిన లోకేష్... తన దగ్గర రెడ్ బుక్ ఉందని తానే సుమారు 90 బహిరంగ సభల్లో చెప్పినట్లు తెలిపారు. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ రెడ్ బుక్ లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామంటూ చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. అయితే... తానింకా రెడ్ బుక్ తెరవక ముందే జగన్ ఢిల్లీ దాకా వెళ్లి గగ్గోలు పెడుతున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు.

కాగా... లోకేష్ రెడ్ బుక్ పై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతీ చోటా రెడ్ బుక్ పేరిట హోర్డింగులు పెడితే సమాజానికి, పోలీసులకు ఏమి సంకేతాలు ఇస్తున్నట్లు అని జగన్ ప్రశ్నించారు. మేము గొడవలు చేస్తాము, హత్యలు చేస్తాము, అత్యాచారలు చేస్తాము, దాడులు చేస్తాము.. అయినా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించండి అని చెప్పినట్లు కాదా అని జగన్ తాజాగా ప్రశ్నించారు.

అయితే లోకేష్ మాత్రం... తానింకా రెడ్ బుక్ ఓపెనే చేయలేదని అంటున్నారు. రెడ్ బుక్ విషయంలో తాను చేసిన కామెంట్లకు కట్టుబడే ఉన్నానని పునరుధ్గాటిస్తున్నారు.