ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఉన్నట్టా లేనట్టా..?


రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ఉన్నట్టా లేనట్టా? ఈ విషయమే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చ‌ర్చ‌గా మారింది. మరో వారం రోజుల్లో ఒకటో తారీకు రానుంది. పింఛన్ల పంపిణీ వ్యవహారం తెర‌మీద‌కు వ‌చ్చింది. వైసిపి ప్రభుత్వం ఉన్నప్పుడు వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందించిన విషయం తెలిసిందే. కానీ కూట‌మి ప్రభుత్వం వచ్చిన తర్వాత జూలై ఒకటో తారీఖున గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందిని రంగంలోకి దింపి వారితోనే పింఛన్లను పంపిణీ చేయించారు. 


దీంతో వాలంటీర్లు అవసరం లేకుండానే పింఛన్లు పంపిణీ చేశామని స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. ఆ తర్వాత అయినా వ‌లంటీర్ల‌ను తీసుకుంటారని అందరూ భావించారు. కానీ ఇప్పటివరకు అంటే ప్రభుత్వం ఏర్పడిన 50 రోజులు అవుతున్నా కూడా వాలంటీర్ల విషయాల్లో ఎటువంటి ప్రకటన రాలేదు. అసలు వాలంటీర్లను కొనసాగిస్తారా? లేదా? అనే విషయంపై కూడా స్పష్టమైన వైఖరిని ప్రకటించలేదు. కానీ ఎన్నికలకు ముందు చంద్రబాబు వాలంటీర్లు కొనసాగుతారని, వారికి ఇచ్చే వేతనం 10 వేల రూపాయల వరకు ఉంటుందని చెప్పారు. 
 
దీంతో అప్పటి వరకు వైసీపీకి అనుకూలంగా ఉన్న వ‌లంటీర్లు.. కూట‌మి పార్టీలకు అనుకూలంగా పనిచేశారని వాద‌న వినిపించింది. మరి కూటమి ప్రభుత్వం వచ్చి 50 రోజులు అవుతున్నా ఇప్పటివరకు వాలంటీర్ల విషయంలో ఒక వైఖ‌రి తీసుకోకపోవడం వారిని ఏం చేస్తారనే విషయాన్ని చెప్పకపోవడం చర్చకు దారి తీశాయి. ఇక వాలంటీర్ల విష‌యాన్ని తీసుకుంటే వారికి కేవలం పింఛన్ల పంపిణీకి మాత్రమే పరిమితం కాలేదు. ప్రభుత్వ కార్యక్రమాల నుంచి ప్రజలకు అవసరమైన అనేక అంశాల వరకు వారి సేవలను నియోగించుకోవడం తెలిసిందే. 

ముఖ్యంగా ప్రజలు తమ అవసరాలను తీర్చుకునేలా గత ప్రభుత్వం వ‌లంటీర్ వ్యవస్థను అమలు చేసింది. ఉదాహరణకి పిల్లలకు సంబంధించిన బ‌ర్త్‌ సర్టిఫికెట్లు, వృద్ధులకు సంబంధించిన వయసు సర్టిఫికెట్లను కూడా వ‌లంటీర్లే తీసుకొచ్చి అందించారు. అలాగే ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలను కూడా ఇంటి నుంచే వారు అందించారు. ర‌క్త‌ పరీక్షలు కూడా ఇంటి వ‌ద్దే చేశారు. కరోనా సమయంలో ఆ తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను ప్రజలకు సేవ చేశారు. 

కాబట్టి వాలంటీర్లు అంటే కేవలం పెన్షన్లు పంపిణీ కోసం ఉపయోగపడ్డారు అనేది అపోహ మాత్రమే. మున్సిపల్ పన్నుల‌ను కట్టించుకోవడంలోనూ, విద్యుత్ బిల్లులను క‌ట్టించుకోవడంలో కూడా వలంటీర్లు ప్రభుత్వానికి సహాయం అందించారు. ద్వారా బిల్లుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి మెరుగైన‌ సేవలు అందించార‌ని చెప్పాలి. కాబట్టి ఈ విషయాన్ని కూడా కూటమి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని కొనసాగించడమే మంచిద‌నే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.