మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు వద్ద జాతర... సిసోడియా షాక్!


Annamayya: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సుమారు 2వేలకు పైగా ఫైల్స్ కాలి బూడిదైనట్లు చెబుతున్నారు. ఈ సమయంలో... ఆ కార్యాలయంలో రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా వినతుల స్వీకరణ కార్యక్రమం చేపట్టారు. దీనికి అనూహ్య స్పందన వచ్చింది. వచ్చిన జనం చూసి జాతరా అనే ఫీలింగ్ కలిగిందని అంటున్నారు.


అవును... మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో సిసోడియా నిర్వహించిన వినతుల స్వీకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. ఈ సమయంలో వందలమంది తమ వినతిపత్రాలు సమర్పించి, ఫిర్యాదులు అందజేశారు. ఈ నేపథ్యంలో... గురువారం ఉద‌యం 7 గంట‌ల నుంచే బాధితులు క్యూ క‌ట్టారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు గత ప్రభుత్వాల హయాంలో ఎదురైన ఇబ్బందులు చెప్పినట్లు తెలుస్తోంది.



ఈ నేపథ్యంలో మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాల నుంచి జనం భారీగా తరలివచ్చారని అంటున్నారు. ఈ క్రమంలో... రాత్రి 8 గంటల వరకూ కూడా సిసోడియా ఫిర్యాదులు స్వీకరించిన పరిస్థితి. ఈ సమయంలో... వీరి స్పందన చూసి సిసోడియా షాక్ అయ్యారని అంటున్నారు. తన పిలుపుకు స్పందించి ఏ పదిమందో వస్తారనుకుంటే.. వందల మంది తరలిరావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో... అర్జీలన్నింటిపైనా విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేస్తామని అన్నారు. ఈ స్థాయిలో జనాలు వినతులతో వచ్చారంటే.. వ్యవస్థలో ఎక్కడో లోపాలున్నాయని అనిపిస్తోందని చెబుతూ.. వినతులపై సమగ్ర విచారణ చేపట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇక సబ్ కలెక్టర్ దహనం ఘటనపై ఫోరెన్సిక్ నివేదిక రాగానే చర్యలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.