ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన ప్రకారం.. వైసీపీ హయాంలో అమలు చేసిన మద్యం పాలసీపై సీఐడీ విచారణకు ఆదేశించనున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది? ఈ విచారణల కారణంగా.. వైసీపీ హయాంలో తీసుకున్న నిర్ణయాలను వెలికి తీయడం సాధ్యమేనా? ఒకవేళ లోపాలు వెలికి తీసినా.. వాటి ప్రకారం.. జగన్‌ను అరెస్టు చేస్తారా? అసలు చంద్రబాబు వ్యూహం ఏంటి? అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
వైసీపీ లిక్కర్ పాలసీ ఇదీ.. + ప్రైవేటు మద్యం దుకాణాల స్థానంలో ప్రభుత్వమే లిక్కర్ వ్యాపారం చేసింది. + అప్పటి వరకు ఉన్న డిస్టిలరీలను పంపించేసి.. స్థానికంగా తయారైన లిక్కర్‌ను ప్రభుత్వం కొనుగోలు చేసింది. + మద్యం వినియోగాన్ని తగ్గించే పేరుతో ధరలను 200 శాతం పెంచింది. + అన్ని దుకాణాల్లోనూ.. నేరుగా నగదుతో కూడిన వ్యాపారాన్ని కొనసాగింది. - ఇదీ.. పైకి కనిపిస్తున్న వ్యాపారం. అయితే.. అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ చెప్పిన లెక్కల ప్రకారం.. ఈ వ్యాపారాల వెనుక.. వైసీపీ నాయకులు డిస్టలరీలను మెయింటెన్ చేసి.. తమకు నచ్చిన బ్రాండ్లను తీసుకువచ్చారనేది తద్వారా.. చీపు లిక్కర్‌ను కూడా అత్యధిక ధరలకు అమ్మి.. సొమ్ము చేసుకున్నారని ఆరోపణలు వున్నాయి.
అయితే.. చీపు బ్రాండ్లపై అప్పట్లోనే వైసీపీ వివరణ ఇచ్చింది. 2014-19 మధ్య టీడీపీ తీసుకువచ్చిన బ్రాండ్లను మాత్రమే తాము అమలు చేశామని సభలోనే లెక్కలు వివరించింది. నాటి చంద్రబాబు సంతకాలతో కూడిన పత్రాలను కూడా సభలో ప్రదర్శించింది. కాబట్టి.. ఇప్పుడు ఆ పాలసీ(చీపు బ్రాండ్లను తీసుకువచ్చిన) ఎవరిదనేది తేల్చాల్సి ఉంది. + నగదు రూపంలో లావాదేవీలు జరిగిన నేపథ్యంలో వీటికి పద్దులు చూపించడం.. లేదా లెక్కలు తేల్చ డం కూడా.. కష్టమే. ఒకవేళ అక్రమాలు జరిగాయని భావిస్తే.. నాటి లెక్కులు తేల్చేందుకు ఏళ్ల సమయం పడుతుంది.
లిక్కర్ కేసును అడ్డు పెట్టుకుని జగన్ ను అరెస్టు చేయించాలనే వ్యూహం ఉన్నప్పటికీ.. దీనికి పక్కా ఆధారాలు చూపించాలి. పైగా మద్యం పాలసీ అనేది అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దీనిలో ఢిల్లీ తరహా రాజకీయ కోణం అయితే.. కనిపించడం లేదు. కాబట్టి.. ఈ కేసును సీఐడీకి ఇచ్చినా.. విచారణ చేయించినా.. సమయం పడుతుంది. నిజాలు ఏంటనేది తేలాలంటే.. డిజిటల్ లావాదేవీలు లేనందున.. అవి తేల్చడం కూడా కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.