అందుకే నొప్పించక తానొవ్వక అన్న తీరున నాయకులు ఏది చేయాలన్నా చేద్దామని చెబుతూనే తొందరలో చేస్తామని హామీలు ఇస్తూంటారు. త్వరలో విడుదల అని నిన్నటి తరం సినిమా పోస్టర్ల మీద కనిపించేది. రాజకీయాల్లో కూడా హామీలు ఎపుడూ త్వరలోనే ఆచరణకు నోచుకుంటాయని తలపండిన నేతలు చెబుతూ ఉంటారు. అలా చెప్పడమే రాజకీయంగా సరైన వ్యూహంగా భావిస్తారు. నో అని చెబితే జనాల్లో రియాక్షన్ వేరెలా ఉంటుంది.
అందుకే నొప్పించక తానొవ్వక అన్న తీరున నాయకులు ఏది చేయాలన్నా చేద్దామని చెబుతూనే తొందరలో చేస్తామని హామీలు ఇస్తూంటారు. ఎన్నికల ముందు చెప్పే మాటలకు ఎన్నికల తరువాత చేసే ప్రకటనలకూ పొంతన ఉండదు, ఎందుకంటే ఖజానాతో వ్యవహారం. డబ్బు ఉంటేనే పని జరిగేది. మొన్న కర్ణాటకలో నిన్న తెలంగాణాలో నేడు ఏపీలో ఎక్కడైనా హామీలు ఎపుడు అమలు అంటే త్వరలోనే అని జవాబు ఇస్తారు. కర్ణాటకలో సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తూ ఖజానా డొల్ల అయిందని చెప్పి వేరే రూపంలో పన్నులు వేస్తున్నారు అని అంటున్నారు.
తెలంగాణాలో రైతు రుణ మాఫీని అధికారంలోకి వచ్చిన ఏడు నెలలకు అమలు చేసినా ఎన్నో కొర్రీలు పెట్టారు అని విపక్షాల విమర్శలు ఉండనే ఉన్నాయి. అయినా ఇంకా చేయాల్సిన హామీలు వారికి మిగిలి ఉన్నాయి. ఏపీలో కొత్తగా టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి కొద్ది రోజులలో రెండు నెలల నిండు కాలం పూర్తి చేసుకోబోతోంది. దాంతో పధకాలు ఎపుడు అమలు అన్న ప్రశ్న సహజంగానే వస్తోంది. దానిని జవాబు కూడా సిద్ధంగానే ఉంది. త్వరలో అని. ఇపుడు అదే మాటను మంత్రులు అంతా చెబుతున్నారు. ప్రతీ పేద కుటుంబానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించే పధకం ఎపుడూ అంటే త్వరలోనే అని పౌర సరఫరాల సాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.
అలాగే తల్లికి వందనం పధకం ఎప్పటి నుంచి అమలు అంటే ప్రస్తుతం విధి విధానాలను రూపొందిస్తున్నామని త్వరలోనే అమలు చేస్తామని ఆ శాఖ మంత్రి నారా లోకేష్ చెబుతున్నారు. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం ఎపుడూ అంటే రవాణా శాఖ మంత్రి రాం ప్రసాదరెడ్డి హామీ ఇస్తున్నారు. పద్దెనిమిదేళ్లు నిండిన మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయల పధకం ఎప్పటి నుంచి అంటే త్వరలో అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి చెబుతున్నారు.
ఈ హామీల ఇబ్బందులు లేని శాఖలు కొన్ని మాత్రమే ఉన్నాయి. ఆయా మంత్రులు మాత్రం తమ శాఖలలో ప్రగతి పనులు త్వరలో చేస్తామని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఆర్ధిక పరిస్థితి మీద చంద్రబాబు శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ ఒక విధంగా బాంబు పేల్చారనే అంటున్నారు. ప్రజలు అర్ధం చేసుకోవాలని ఆయన కోరిన కోరికతో పధకాలు ఇప్పట్లో అమలు కావు అనే సందేశం ఉంది అని అంటున్నారు. ఈ క్రమంలో త్వరలో అన్న మాటను బయటకు చెబుతున్నప్పటికీ ఈ ఆర్ధిక సంవత్సరంలో ఏమీ చేసేది ఉండదని అంటున్నారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను ఒక గాడిన పెట్టిన తరువాత నెమ్మదిగా వచ్చే ఏడాది నుంచి ఒక్కో పధకాన్ని అమలు చేస్తే బాగుంటుందని అది కూడా కండిషన్లు అప్లై అన్న తీరున చేస్తే భారం తగ్గుతుందని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది అని అంటున్నారు.
అందువల్లనే త్వరలో విడుదల అన్నట్లుగా ఈ ప్రకటనలు వస్తున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతానికి చూస్తే ఆర్ధిక వ్యవస్థ మరీ దారుణంగా ఏమీ లేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అయితే ఉద్యోగుల జీతాలు ప్రభుత్వ పెన్షనర్లకు పెన్షన్లు సామాజిక పెన్షన్లు ఇలా వీటికి ఖర్చు చేస్తూ ఆ మిగిలిన దానిలో ఎంతో కొంత అభివృద్ధికి మౌలిక సదుపాయాలకు వెచ్చించాలన్న ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఉందని అంటున్నారు.
రహదారుల పునర్ నిర్మాణానికి వేయి కోట్లు ఖర్చు అవుతాయని అంచనా ఉంది. అలాగే సాగు నీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలి. ఇతర ప్రగతి పనులకూ నిధులు కావాలి దాంతో ముందు సంక్షేమ పధకాలు అమలు చేసి అసలుకే ఎసరు తెచ్చుకోకుండా కూటమి ప్రభుత్వం జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందులో భాగంగానే ఆర్ధిక పరిస్థితి బాగులేదు అని చెప్పడం ద్వారా ప్రజలకు నచ్చచెప్పాలని చూస్తోంది. ఏపీలో వైసీపీ ఉన్నా జనాలకు ఇంకా ఆ వైపు మొగ్గు లేదు. దాంతో టీడీపీ కూటమికి అంతా సానుకూలంగానే ఉంది కాబట్టి ఇదే విధానంలో ముందుకు పోవచ్చు అని అంటున్నారు.