ఇదంతా నీవు నేర్పిన విద్యయే జగనన్నా!


జగన్‌ మూర్ఖత్వానికి ఆయన్ను మ్యూజియంలో పెట్టాలని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు, జగన్‌ కు చంద్రబాబు పిచ్చి పట్టుకుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయాక టీడీపీ, జనసేన పార్టీ అధినేతలు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ లను మించి వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల. జగన్‌ అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్‌ విగ్రహాలను కూలగొట్టించారని.. అందుకు ప్రతిఫలంగా ఇప్పుడు వైఎస్సార్‌ విగ్రహాలను టీడీపీ కూలగొడుతోందన్నారు. అహంకారమే వైఎస్‌ జగన్‌ పతనానికి కారణమని స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్‌ విగ్రహాలను కూల్చకుండా ఉండి ఉంటే.. ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. అలాగే ఎన్టీఆర్‌ యూనివర్సిటీ పేరును మార్చి వైఎస్సార్‌ పేరును పెట్టకపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదని స్పష్టం చేశారు. 


తనను, తన తల్లి విజయమ్మను దూషించేవారే వైసీపీలో పెద్ద నాయకులుగా చలామణి అవుతున్నారని షర్మిల ఎద్దేవా చేశారు. అసెంబ్లీకొచ్చి ప్రజాసమస్యలపై నిలదీయాలని తాను డిమాండ్‌ చేస్తుంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొమ్ముకాస్తున్నానంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌ సీపీలో వైఎస్సార్‌ ను ఎప్పుడో వెళ్లగొట్టారని షర్మిల హాట్‌ కామెంట్స్‌ చేశారు. వైఎస్‌ఆర్‌ పార్టీలో వై అంటే వైవీ సుబ్బారెడ్డి, ఎస్‌ అంటే సాయిరెడ్డి, ఆర్‌ అంటే రామకృష్ణారెడ్డి అని షర్మిల ఎద్దేవా చేశారు. 
 
జగన్‌ మూర్ఖత్వానికి ఆయన్ను మ్యూజియంలో పెట్టాలని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు, జగన్‌ కు చంద్రబాబు పిచ్చి పట్టుకుందన్నారు. గతంలో జగన్‌ ను అద్ధంలో చూసుకోమని చెప్పానని, ఇప్పుడు కూడా అద్దంలో ఆయనకు చంద్రబాబే కనబడుతున్నాడని ఎద్దేవా చేశారు. జగన్‌ ను విమర్శిస్తుంటే తనను కించపరుస్తూ వైసీపీ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. తనను కించపరిచేంత ద్వేషం జగన్‌ కు ఉన్నా.. ఆయనపై తనకు ద్వేషం లేదని షర్మిల తెలిపారు. ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందా అని నిలదీశారు. తప్పు చేస్తే తాము ఎవరినైనా నిలదీస్తామని స్పష్టం చేశారు. 

జగన్‌ అసెంబ్లీకి వెళ్లడం లేదు కాబట్టే దాన్ని తప్పని చెప్పానన్నారు. అసెంబ్లీని గౌరవించడం లేదు కాబట్టే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశానన్నారు. వైఎస్సార్‌ లా జగన్‌ కు పోరాటం చేయడం చేతకాదన్నారు. వైసీపీకి మీడియా పాయింటే ఎక్కువని ఎద్దేవా చేశారు. జగన్‌ రూ.3 వేల కోట్లతో ప్రతి ఏటా ధరల స్థిరీకరణ నిధి అన్నారని గుర్తు చేశారు. అలాగే 4 వేల కోట్లతో పంటనష్ట పరిహారమన్నారన్నారు. కానీ వాటిని అమలు చేయలేదున్నారు. జగన్‌ కంటే మోసగాళ్లు, విశ్వసనీయత కోల్పోయిన వారెవరైనా ఉంటారా అని షర్మిల ధ్వజమెత్తారు. 

శరీరంలో అణువణువునా పిరికితనం పెట్టుకున్న జగన్‌ వ్యక్తిగత ప్రయోజనాల కోసం బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీని వ్యతిరేకించిన వైఎస్సార్‌ ఆశయాలకు విరుద్ధంగా జగన్‌ బీజేపీకి మద్దతునిస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో షర్మిల వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారాయి. షర్మిలపై వైసీపీ సోషల్‌ మీడియా వార్‌ కొనసాగిస్తోంది. చంద్రబాబు ఏజెంట్‌ షర్మిల అని వైసీపీ ఆరోపణలు చేస్తోంది.