గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కారాలయంపై దాడి కేసు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ దాడి కేసుపై కూటమి సర్కార్ వచ్చిన తర్వాత దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ కేసులో 19 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు చెబుతున్నారు. వీరిలో తాజాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరులుగా చెబుతున్న రమేష్, యూసఫ్ పఠాన్ లను అదుపులోకి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో రమేష్ ను శుక్రవారం కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఇక యూసఫ్ పఠాన్ ని శనివారం హాజరుపరిచనున్నారు! ఇదే సమయంలో మరికొంతమంది కీలక, ప్రధాన నిందితులు హైదరాబాద్ లో ఉన్నారనే సమాచారం మేరకు... భాగ్యనగరాన్ని పోలీసులు జల్లెడపడుతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే వంశీ ఎక్కడ అనేది హాట్ టాపిక్ గా మారింది.
వల్లభనేని వంశీ కీలక అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు శుక్రవారం వార్తలు వచ్చిన సమయంలోనే.. వల్లభనేని వంశీనీ అరెస్ట్ చేసినట్లు ప్రచారం హల్ చల్ చేసింది. అయితే... తాజాగా ఆ ప్రచారం అవాస్తవమని అంటున్నారు. ఈ మేరకు వంశీతో పాటు మరికొంతమంది నిందితులు గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోనే ఉన్నారనే చర్చ నడుస్తోంది.
ఈ నేపథ్యలో వీరికోసం అధికారులు ఇక్కడే మకాం వేసి, వంశీ సహా పలువురు నిందితులపై నిఘా ఉంచారని అంటున్నారు. దీంతో... శుక్రవారం సాయంత్రం సమయంలో హైదరాబాద్ నుంచి గన్నవరం వస్తున్న వంశీని ఫాలో అయిన పోలీసులు.. ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే... ఆ ప్రచారం అవాస్తవమంటూ పోలీసులు కొట్టిపారేశారు!
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం ఈ కేసు మరింత హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో... పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దీంతో... గన్నవరంలో ఉండే వంశీ, ఆయన ప్రధాన అనుచరులంతా హైదరాబాద్ కి మకాం మార్చారని అంటున్నారు. ఇందులో భాగంగా రాయదుర్గంలోని ఓ గేటెడ్ కమ్యునిటీలో వీరంతా తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం అందిందని చెబుతున్నారు.
పోలీసులు ఆ గేటెడ్ కమ్యునిటీ వద్దకు వెళ్లే సరికే వారంతా తప్పించుకుని వెళ్లిపోయారని అంటున్నారు. వారిలో వంశీ ప్రధాన అనుచరులు ఉన్నారని భావిస్తున్నారు! ఈ నేపథ్యంలో... అసలు పోలీసులు అక్కడకు వస్తున్నట్లు వీరికి ముందుగానే సమాచారం అందించింది ఎవరనేది చర్చనీయాంశం అయ్యింది. మరోపక్క అక్కడే ఉంటున్న వంశీ ఫ్యామిలీ మెంబర్స్ రెండు రోజుల కిందటే వ్యక్తిగత పనులమీద ఆంధ్రకు వెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారట!
మరోపక్క శుక్రవారం సాయంత్రం వంశీ సతీమణి గన్నవరం నుంచి హైదరాబాద్ కు వెళ్లినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో... వంశీ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారని తెలుస్తోంది.