ఏ ఇంటి తలుపుతట్టినా జ్వరాలతో..


చింతలపూడి: పట్టణం, పరిసర గ్రామాల్లో ఏ ఇంటి తలుపుతట్టినా జ్వరాలతో వణుకుతున్నారు. నిలబడలేం, కూర్చోలేం, ఒళ్లంతా నొప్పులు, కాళ్ల వాపులు, గొంతు తడిఆరిపోవడం, నీరసం, ఒకోసారి చలిజ్వరం, అంటూ పలువురు బాధితులు వాపోతున్నారు. 15రోజులు దాటినా ఈ లక్షణాలే పట్టిపీడిస్తున్నాయని జ్వరాల బారిన పడినవారు చెబుతున్నారు. రోజులో ఏదొక సమయంలో సడన్‌గా నీరసంతో కొంతసేపు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుందని, తర్వాత నొప్పులతో బాధపడుతున్నా వారు అధికం. 40 ఏళ్లు వయసు దాటిన వారిలో అధికంగా జ్వరాలు వస్తున్నాయని చెబుతున్నారు. మందులు, ఇంజక్షన్లు వాడినా జ్వరతీవ్రత తగ్గినా విపరీతమైన నీరసంతో బాధపడుతున్నామని, నిలబడడం, నడవడం కూడా భారంగా ఉంటోందని పలువురు చెబుతున్నారు. 


జ్వరాల బారిన పడినవారు పండ్ల రసాలు, పండ్లు, బొప్పాయి వంటివి తీసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇంట్లో ఒకరికి వచ్చిందంటే ఇంటిల్లపాది జ్వరాల బారిన పడుతున్నామని చెబుతున్నారు. పట్టణ పరిసర ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు తక్కువ. చింతలపూడి పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో 30 బెడ్లు మాత్రమే ఉండడం తో ఎప్పుడూ పేషెంట్లతో నిండి ఉంటున్నాయి. ఒకోసారి ఒకే బెడ్‌పై ఇద్దరు పేషెంట్లను ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రైవేట్‌ ఆసుపత్రులు కూడా తక్కువ కావడంతో చాలామంది పీఎంపీలను ఆశ్రయిస్తున్నారు. 

కొంతమంది రోగులు నేరుగా రక్తపరీక్షల కోసం తిరుగుతున్నారు. పరిసర గ్రామాల్లోని రోగులు జంగారెడ్డిగూడెం, ఏలూరు, సత్తుపల్లి ప్రాంతాలకు వెళ్లి వైద్యసేవలు పొందుతున్నారు. చింతలపూడి పట్టణంలో ప్రతి వీధిలో డ్రైనేజి సమస్యలు, దోమలు బెడద ఉన్నాయి. ప్రధాన రహదారి పై దుమ్ము కాలుష్యం బాధిస్తోంది. రోడ్డుపై చెత్త వాహనాల కింద నలిగి మార్కెట్‌కు వచ్చే ప్రజలకు దుమ్ముకాలుష్యాన్ని తీసుకువస్తున్నాయి.

అవి వైరల్‌ జ్వరాలే
పట్టణ పరిసర ప్రాంతాల్లో 20 రోజుల నుంచి వైరల్‌ జ్వరాలు తీవ్రంగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. జ్వరతీవ్రత కంటే ఒంటినొప్పులు, వాపులు ఈ లక్షణాలు వైరల్‌ జ్వరాలకు చెందినవే. ఇంటి పరిసరాల్లో పరిశుభ్రత, పొడి వాతావరణం వంటి జాగ్రత్తలతో కొంతవరకు అదుపు చేయవచ్చు. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి. దోమ తెరలు ఉపయోగించడం, జ్వరాల బారిన పడిన వారు కాచిచల్లార్చిన నీరు తాగాలి. డీ హైడ్రేషన్‌కు గురి కాకుండా నీరు, పండ్ల రసాలు ఎక్కువ తీసుకోవాలి. వీటితో పాటు జ్వరాల లక్షణాలు కనిపించగానే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
-కిరణ్‌ చైతన్య, పీహెచ్‌సీ వైద్యాధికారి, రాఘవాపురం