వైసీపీ ప్రభుత్వంలో పూర్తి నిర్లక్ష్యానికి గురయిన అమరావతికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో మంచి రోజులు వచ్చాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు తగ్గట్టే కొద్ది రోజుల క్రితం కేంద్ర బడ్జెట్ లో అమరావతి రాజధానికి రూ.15 వేల కోట్లు ఇస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. అంతేకాకుండా ఎర్రుపాలెం – అమరావతి – నంబూరు రైల్వే లైనుకు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక మొదటి తన తొలి పర్యటనకు పోలవరం ప్రాజెక్టును ఎంచుకోగా, రెండో పర్యటనకు అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. ఏపీలో.. ఏ అంటే అమరావతి, పీ అంటే.. పోలవరం అని టీడీపీ నేతలు భాష్యం చెబుతున్నారు.
ఇప్పటికే అమరావతిలో తొలి దశ నిర్మాణాలను ఏడాదిన్నరలోపు పూర్తి చేస్తామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. అయితే చంద్రబాబు 2014–19 సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిలో కొన్ని నిర్మాణాలు పూర్తయ్యాయి. కొన్ని పునాది దశలో ఆగిపోయాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్ మూడు రాజధానుల పల్లవిని ఎత్తుకున్నారు. ఏపీకి కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం ఉంటుందన్నారు. అమరావతిని కేవలం శాసన రాజధానిగా మాత్రమే పేర్కొన్నారు. దీంతో అమరావతి అభివృద్ధి గత ఐదేళ్లు ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టు నిలిచిపోయిందని విమర్శలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతిలో గతంలో తాము నిర్మించిన నిర్మాణాలను పరిశీలిస్తోంది. ఆ నిర్మాణాలు పటిష్టంగానే ఉన్నాయా, ఇప్పుడు పనికొస్తాయా, పునాదులు బలంగా ఉన్నాయా అనే అంశాలపై నిపుణులతో ప్రభుత్వం తనిఖీ చేయిస్తోంది. అమరావతిలో నిర్మాణాలను పరిశీలించి నివేదిక ఇచ్చే బాధ్యతను ఐఐటీ హైదరాబాద్ కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. దీంతో తాజాగా ఐఐటీ హైదరాబాద్ నిపుణుల బృందం అమరావతి ప్రాంతాన్ని పరిశీలించింది. ఎన్జీవో నివాస సముదాయాల్లో ఇనుప చువ్వలు భారీగా తుప్పుపట్టాయని తేల్చింది. వీటి విషయంలో ఏం చేయాలో ఇప్పటికిప్పుడే చెప్పలేమని తెలిపింది.
చువ్వలను పూర్తిగా తొలగించిన తర్వాత, లేదా శుభ్రం చేసిన తర్వాతే నిర్మాణ పనులు ప్రారంభించాల్సి వస్తుందని ఐఐటీ హైదరాబాద్ నిపుణులు అభిప్రాయపడ్డారు. పరీక్షలన్నీ పూర్తి స్థాయిలో చేస్తేనే నిర్మాణాలు ఏ స్థాయి వరకు బలంగా ఉన్నాయనే అనే అంశం చెప్పగలగమని చెబుతున్నారు. ఇందుకు చాలా సమయం పడుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాణాల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు మట్టి పరీక్షలతో పాటు నాన్–డిస్ట్రక్టివ్, కోర్ కటింగ్ పరీక్షలు కూడా నిర్వహించాలని నిర్ణయించారు.
తాజాగా అమరావతిలో పర్యటించిన ఐఐటీ హైదరాబాద్ నిపుణులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లను కూడా పరిశీలించారు. అలాగే అఖిలభారత సర్వీసు అధికారులు, విభాగాధిపతులు, ఎన్జీఓ, గెజిటెడ్, నాలుగో తరగతి ఉద్యోగుల కోసం నిర్మించిన వాటిని కూడా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) అధికారుల నుంచి ఐఐటీ నిపుణుల బృందం పలు విషయాలు తెలుసుకుంది. ఈ నిర్మాణాలను ఎప్పుడు ప్రారంభించారు? ఎలాంటి మెటీరియల్ వాడారు? కాంట్రాక్టు సంస్థ తదితర వివరాలను తెలుసుకున్నారు.
మరో రెండు రోజుల పర్యటనలో భాగంగగా ఐఐటీ హైదరాబాద్ నిపుణులు రాజధాని ప్రాంతంలో రోడ్లు, వంతెనలు, విద్యుత్తు, కమ్యూనికేషన్ కేబుళ్ల సామర్థ్యాలను కూడా పరిశీలిస్తారని చెబుతున్నారు. అలాగే ఐఐటీ మద్రాస్ బృందం కూడా రాజధానికి వస్తోంది. ఈ బృందం సాధారణ పరిపాలన శాఖ కోసం నిర్మించిన టవర్లు, శాశ్వత హైకోర్టు పునాదులు తదితరాలను పరిశీలిస్తుంది.