AP NEWS,Amaravathi: గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానికి కూటమి ప్రభుత్వంలో ఉచ్చు బిగుస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ నేతలు విపరీతంగా రెచ్చిపోయారని.. తప్పు మీద తప్పులు చేశారని.. వారి ఇష్టారాజ్యంగా నడుచుకున్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో... ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పోలీసులు సదరు వైసీపీ నేతలకు చుక్కలు చూపిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొడాలి నానికి ఉచ్చు బిగుస్తుందని అంటున్నారు!
గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానికి కూటమి ప్రభుత్వంలో ఉచ్చు బిగుస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అప్పట్లో కేసినో నిర్వహించారని, ప్రత్యర్థులపై దాడులు చేయించారనే విమర్శలు బలంగా వినిపించిన సంగతి తెలిసిందే. వీటిపై అప్పట్లో పలు కేసులు నమోదైనా ముందుకు కదలలేదని, కొన్నింటిని మూసేశారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ కేసులనే పోలీసులు వెలికి తీస్తున్నారని తెలుస్తోంది.
వాస్తవానికి కొడాలి నానిపై గతంలో టీడీపీ నేతల నుంచి విపరీతమైన ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర రావును కొడాలి అనుచరులు బెదిరించారనే ఆరోపణలూ ఉన్నాయి. ఇదే క్రమంలో... రంగా వర్ధంతిలో పాల్గొనకూడదంటూ వైసీపీ నేతలు పలుమార్లు బెదిరించినట్లు చెబుతారు. ఇదే క్రమంలో 2022 డిసెంబర్ 25న టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన పరిస్థితి. ఈ ఘటనలో అప్పటి సీఐ.. వైసీపీ నేతలకు కొమ్ముకాశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే పోలీసులు దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్ సేకరించినట్లు తెలుస్తోంది. నాడు ఈ దాడుల్లో.. కొడాలి నాని అనుచరులు, వైసీపీ నేతలు కలిపి సుమారు 22 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇక్కడ ప్రధానంగా ఈ వ్యవహారంలో కొడాలి పాత్రను వెలికితీసే పనిలో ఉన్నారని అంటున్నారు.
మరోవైపు గతంలో కే కన్వెన్షన్ క్యాసినో వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ నిజనిర్ధారణ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. అయితే నాడు గుడివాడ వచ్చిన నిజనిర్ధారణ కమిటీపైనా కొడాలి నాని అనుచరులు, వైసీపీ నేతలు దాడులకు పాల్పడ్డారనే విమర్శలు వినిపించాయి. అయినప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోలేదని టీడీపీ నేతలు ఆరోపించారు. ఇందులో కూడా కొడాలి పాత్రను నిరూపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు! కాగా... ఇప్పటికే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిలో పలువురిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోసం వెతుకుతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొడాలి నానికీ ఉచ్చు బిగిస్తుందనే మాటలు వినిపిస్తున్నాయి.