ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అవినీతి, అక్రమాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా పెద్ద ఎత్తున భూములు చేతులు మారాయానే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మండలానికో కుంభకోణం జరిగిందని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు.
అలాగే గత ప్రభుత్వ హయాంలో మద్యం, మైనింగ్ వ్యవహారాలకు సంబంధించి పలు ఫైళ్లు మాయమయ్యానని ఇప్పటికే వార్తలు వచ్చాయి. మైనింగ్ శాఖకు సంబంధించి బస్తాలకొద్దీ ఫైళ్లు, డాక్యుమెంట్లను, రికార్డులను విజయవాడలోని అవనిగడ్డ వైపు తీసుకొచ్చి తగులబెట్టడం హాట్ టాపిక్ గా మారింది.
మరోవైపు సాక్షాత్తూ రాజధాని అమరావతి ప్రాంతంలో కీలక ఫైళ్లు మాయమయ్యాయని టాక్ నడుస్తోంది. రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సీఆర్డీయే) కార్యాలయంలో కొన్ని ఫైళ్లు కనిపించడం లేదని అంటున్నారు.
గత వైసీపీ ప్రభుత్వం.. రాజధానిలో అనేక అక్రమాలు, అవినీతి, కుంభకోణం చోటు చేసుకున్నాయంటూ చంద్రబాబు, నారా లోకేశ్, నారాయణ తదితరులపై కేసులు మోపింది. ఈ క్రమంలో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ చంద్రబాబును అరెస్టు చేసింది.
అలాగే చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ లక్ష్యంగా ఎన్నో కేసులను జగన్ ప్రభుత్వ హయాంలో నమోదు చేశారు. చంద్రబాబు, లోకేశ్ పై కేసులకు సంబంధించిన ఫైళ్లు ఇప్పుడు మాయమయ్యాయని తెలుస్తోంది.
ఏపీ సీఆర్డీయే కార్యాలయంలో ముఖ్యమైన ఫైళ్లు మాయమయ్యాయని అంటున్నారు. 2014–19లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా అమరావతిని ఖరారు చేశారు. అమరావతి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (ఏపీ సీఆర్డీయే)ను ఏర్పాటు చేశారు. రాజధానికి సంబంధించిన తీసుకున్న నిర్ణయాలు, ఖర్చు చేసిన వ్యయం, వివిధ సంస్థలతో జరిగిన ఒప్పందాలు వంటి వివరాలన్నింటినీ ఫైళ్ల రూపంలో భద్రపరిచింది.
ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చాక ఏపీ సీఆర్డీయే కార్యాలయంలోని ఫైళ్లను స్వాధీనం చేసుకుందని సమాచారం. చంద్రబాబు, నారా లోకేశ్ లపై కేసుల నమోదే లక్ష్యంగా ఆ ఫైళ్లలో ప్రతి అంశాన్ని అణుఅణువూ పరిశీలించినట్టు తెలుస్తోంది.
ఆ తర్వాత చంద్రబాబు, లోకేశ్, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తదితరులపై కేసులు నమోదు చేశారు. అయితే ఆ ఫైళ్లను తిరిగి సీఆర్డీయే కార్యాలయంలో అప్పగించలేదని తెలుస్తోంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సీఆర్డీయే కార్యాలయంలో నాటి ఫైళ్ల కోసం చూడగా దొరకలేదని సమాచారం. 2014–19 మధ్య రాజధాని కోసం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి సీఆర్డీయే కార్యాలయంలో కూటమి ప్రభుత్వం పైళ్ల కోసం ప్రయత్నించినట్టు తెలుస్తోంది. అయితే అక్కడ ఫైళ్లు మిస్సయ్యాయని చెబుతున్నారు.
రాజధాని అమరావతికి సంబంధించి వివిధ నిర్మాణాల డిజైన్లు, పూర్తయిన నిర్మాణాలు, ఇంజనీరింగ్, ప్రణాళిక, రెవెన్యూ తదితర విభాగాల ఫైళ్లు కనిపించడం లేదని చెబుతున్నారు. ఈ ఫైళ్లను గత ప్రభుత్వం విచారణ పేరుతో తీసుకుందని అధికారులు పేర్కొంటున్నారు, ఈ విషయం మంత్రి నారాయణ దృష్టికి కూడా వెళ్లిందని అంటున్నారు.