ANDRA PRADESH, SRIKAKULAM:
ఎన్నికల్లో దారుణ పరాజయం పాలైన వైసీపీకి ప్రజల్లో అభిమానం తగ్గలేదన్నట్లుగా చోటు చేసుకున్న ఒక పరిణామం ఆసక్తికరంగానే కాదు.. ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసేలా మారింది. జగన్ అభిమానులు.. ఆయన్ను ఆరాధించే వారు దేనికైనా రెఢీ అన్నట్లుగా ఉంటారన్న వాదనకు ఇదో ఉదాహరణగా చెప్పాలి. వినాయక నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో.. కావాలి జగన్.. రావాలి జగన్ అంటూ సాగిన పాటల సందడి ఒక్కసారి ఆశ్చర్యానికి గురి చేసింది.నిమజ్జన వేళ రాజకీయ రంగుతోకూడిన పాటలేంటన్న ప్రశ్నలు ఎదురయ్యాయి. అయినప్పటికీ వాటిని కంటిన్యూ చేశారు.
ఈ వ్యవహారంపై తమకు అందిన ఫిర్యాదు నేపథ్యంలో వారిపై కేసులు నమోదు చేసినట్లుగా బి. కొత్తకోట పోలీసులు చెబుతున్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా నిర్వహించే ఊరేగింపులో జగన్ పాటలు పెట్టటం ద్వారా ఎదుటి వారిని రెచ్చగొట్టేలా ప్రవర్తించారంటూ వారిపై ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో వారిపై కేసులు నమోదు చేశారు. వినాయక చవితి సందర్భంగా గణపతి విగ్రహాల్ని ఏర్పాటు చేసి.. వేడుకల్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు తగ్గట్లే బి.కొత్తకోటలోని స్థానిక పోకనాటి వీధిలో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటుచేసి.. పందిరి వేశారు. ఈ నెల 13న ప్రారంభమైన వినాయక నిమజ్జన ఊరేగింపు జ్యోతి బస్టాండ్ కు చేరుకున్న వేళలో.. డీజే సౌండ్ బాక్సుల నుంచి కావాలి జగన్.. రావాలి జగన్ అంటూ పాటలు మొదలయ్యాయి.
ఈ పాటలకు ఒక్కసారి ఆశ్చర్యం వ్యక్తమైనా.. ఆ తర్వాత వారి అభిమానులు పెద్దఎత్తున డ్యాన్సులు చేశారు. కాసేపటికి వైసీపీ జెండాల్ని వాహనాల మీద కొందరు ప్రదర్శించారు. దీనిపై టీడీపీనేతలు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన పోలీసులు విచారణ చేపట్టారు. వినాయక ఊరేగింపులో రాజకీయ పార్టీల ప్రస్తావన తీసుకురావటాన్ని ప్రశ్నిస్తూ.. నిర్వాహకుల నుంచి వివరణ తీసుకున్నారు. భక్తిభావనతో నిర్వహించాల్సిన కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రస్తావన తీసుకురావటాన్ని తప్పు పట్టారు. కేసులు నమోదు చేశారు. ఈ తరహా పరిణామాలుమళ్లీ చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.