ఏడిద గ్రామంలో దీపావళి సామాగ్రి పేలుడు ఘటన విచారకరం
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్
మండపేట మండలం, BCN రిపోర్టర్ దొరబాబు: రామచంద్రపురం డివిజన్ మండపేట మండలం ఏడిద గ్రామంలో సోమవారం జరిగిన దీపావళి సామాగ్రి పేలుడు ఘటనలో ఓ వ్యక్తి మృతి చెంది, మరొ ముగ్గురు గాయపడటం పట్ల రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో వున్న మంత్రి సుభాష్ ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఫోన్ లో అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందిన కొల్లు వెంకట కృష్ణ కుటుంబాన్ని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఫోన్ ద్వారా పరామర్శించి ఓదార్చారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా చెప్పారు. ప్రమాదం జరిగిన విషయాన్ని పార్టీ నాయకులు ద్వారా తనకు తెలిసిందన్నారు. వెంటనే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించామన్నారు.
బాధిత కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దీపావళి సందర్భంగా మందుగుండు సామాగ్రితో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వుండాలని మంత్రి సుభాష్ కోరారు. సంతోషంగా జరుపుకోవాలని దీపావళి పండుగ ఒక కుటుంబంలో విషాదం నెలకొల్పడం చాలా బాధాకరం అన్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని, దీపావళి పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.