శ్రీవారి దర్శనానికి టీ షర్ట్, ప్యాంటుతో వచ్చిన భక్తురాలు.. టీటీడీ నిబంధనలు తెలియవా!


ANDRAPRADESH, THIRUMALA: తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం అంశం వివాదాస్పదమవుతోంది. వీఐపీ బ్రేక్ దర్శనాల విషయంలో సాంప్రదాయ వస్త్రాలు ధరించాలనే నిబంధనను పాటించలేదనే విమర్శలు వస్తున్నాయి. సోమవారం (జనవరి 27న) ఓ మహిళా భక్తురాలు ప్యాంట్, టీ షర్టుతో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఓ మహిళ తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం అనంతరం ఎర్ర రంగు ప్యాంట్, టీషర్ట్ ధరించి ఆలయంలో నుంచి బయటకు వచ్చారు.


అయితే తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి వచ్చే భక్తులు కచ్చితంగా సాంప్రదాయ వస్త్రాలను ధరించి రావాలని టీటీడీ నిబంధన ఉంది. కానీ మహిళా భక్తురాలు.. ప్యాంట్, టీషర్ట్ ధరించి దర్శనానికి రావడం ఏంటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సాంప్రదాయ వస్త్రాలు లేకుంటే విఐపీ దర్శనంలో అనుమతి ఉండదని.. టీటీడీ సిబ్బంది ఆమెను దర్శనానికి ఎలా అనుమతించారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సాంప్రదాయ వస్త్రాల్లో రాకపోయినా.. మహిళా భక్తురాలని ఆలయంలోకి ఎలా పంపారంటున్నారు. అందరికి ఒకే నిబంధనను అమలు చేయాలంటున్నారు. ఈ అంశంపై టీటీడీ స్పందించాల్సి ఉంది.

టీటీడీ 2013 నుంచి తిరుమలలో డ్రెస్‌కోడ్‌ను అమలు చేస్తోంది. ఆ నిబంధనల ప్రకారం.. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, శ్రీవాణి ట్రస్ట్ ప్రత్యేక దర్శనానికి వచ్చే భక్తులు కచ్చితంగా సాంప్రదాయ దుస్తులు ధరించాలి. మగవారైతే.. షర్ట్, పంచె, పైజమాతో రావాల్సి ఉంటుంది.. మహిళలు చీర, చుడిదార్, హాఫ్ శారీలో రావాల్సి ఉంటుంది.

ప్రయాగ్ రాజ్ లో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం
మహా కుంభమేళా సందర్భంగా దేవరియాలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర దేవస్థానంవారు ప్రయాగ్ రాజ్ లోని సెక్టార్-8లో ఏర్పాటు చేసిన భక్తి వాటికా సేవా శిబిరంలో ఆదివారం శ్రీ శ్రీనివాస కల్యాణాన్ని టీటీడీ అంగరంగ వైభవంగా నిర్వహించింది. ముందుగా తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చుకులు శ్రీ రాజేష్ దీక్షితులు ఆధ్వర్యంలో అర్చక బృందం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ స్వామి వారి ఉత్సవర్లను కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు.

అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీ విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణ ధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహా సంకల్పం, మాంగళ్య పూజ, మంగళ సూత్రధారణ మొదలయిన ఘట్టాలతో శాస్త్రోక్తంగా శ్రీ స్వామి అమ్మవార్ల కల్యాణాన్ని నిర్వహించారు.

చివరిగా శ్రీ స్వామి అమ్మవార్లకు నక్షత్ర హారతి, మంగళహారతి సమర్పించడం తో కల్యాణం దిగ్విజయంగా ముగిసింది. శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా తిలకించిన భక్తులు భక్తి పరవశంతో పులకించారు. ఈ కార్యక్రమంలో జగద్గురు శ్రీరామానుజాచార్యస్వామి రాజనారాయణాచార్య, హెచ్ డీపీపీ అడిషనల్ సెక్రటరీ రామ్ గోపాల్, ఏఈవో ప్రభాకర్ రెడ్డి, బొక్కసం ఇంఛార్జ్ గురురాజ స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.