టీడీపీ ఎమ్మెల్యే బూతుపురాణమన్న వైసీపీ.. హత్యాయత్నం చేశారంటున్న చింతమనేని.. ఏం జరిగిందంటే


ఏలూరు జిల్లా: దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. చింతమనేని బూతుపురాణం అంటూ వైఎస్సార్‌సీపీ వీడియోను ట్వీట్ చేసింది. ఓ వివాహ వేడుక దగ్గర కారు అడ్డుగా ఉందంటూ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి డ్రైవర్‌ని చింతమనేని బూతులు తిట్టారని ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. చింతమనేని ప్రభాకర్ తీరుపై విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత చింతమనేని స్పందించారు. తనపై హత్యాయత్ననం జరిగిందన్నారు.


ఏలూరు జిల్లా వట్లూరులో ఓ వివాహ కార్యక్రమానికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాజరయ్యారు. అయితే పెళ్లికి హాజరై తిరిగివస్తున్న సమయంలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ శ్రేణుల మధ్య గొడవ జరిగిందంటున్నారు. తన కారును వెళ్లనివ్వకుండా వైఎస్సార్‌సీపీ నేతలు అడ్డుకున్నారుని.. తన కారు ఎదురుగా కారు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. తన సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నా వినిపించుకోలేదని.. వైఎస్సార్‌సీపీ అబ్బయ్య చౌదరి దగ్గరుండి కారు అడ్డుపెట్టించారని ఆరోపించారు. దెందులూరు నియోజకవర్గంలో గొడవలు సృష్టించాలని వైఎస్సార్‌సీపీ నాయకులు భావిస్తున్నారన్నారు. తనపై హత్యాయత్నం జరిగిందని.. తన డ్రైవర్, గన్‌మెన్‌పై అల్లరిమూకలు దాడి చేశాయని.. గన్‌మెన్ దగ్గర గన్ లాక్కుని దాడి చేయబోయారన్నారు.. సిబ్బంది అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పిందన్నారు.

"కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవ్వరూ కూడా ఆవేశ పడకండి - వైసీపీ దురాగతాలను ముఖ్యమంత్రి గారు, ఉపముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాం - వైసీపీ మూకలు చిల్లర వేషాలు మానుకోక పోతే మీలో ఏ ఒక్కడు కూడా గ్రామాల్లో తిరిగే పరిస్థితి ఉండదు .. కానీ మేము మా, నాయకుడు చంద్రబాబు గారు, కూటమి నాయకులు అంతా కూడా చట్టాన్ని గౌరవిస్తాం. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. మాకు రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ముఖ్యం - మీరు అలజడులు సృష్టించి శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోం" అన్నారు చింతమనేని. అర్థరాత్రి వేళ దుగ్గిరాల క్యాంపు కార్యాలయానికి చేరుకున్న వందలాది మంది కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సముదాయించారు అంటూ పోస్ట్ పెట్టారు.