YSR జిల్లా: యజమాని జీతం డబ్బులు ఇవ్వలేదనే కోపంతో గుమస్తా.. ఓనర్ భార్య ఒంటిపై ఉన్న నగలను దోచుకెళ్లిన ఘటన వైఎస్ఆర్ కడప జిల్లాలో చోటుచేసుకుంది. ప్రొద్దుటూరులో ఈ ఘటన జరగ్గా.. నిందితుడిని పోలీసులు 12 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 12 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ప్రొద్దుటూరు టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం డీఎస్పీ భావన వెల్లడించారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ప్రొద్దుటూరులోని ఆంధ్రకేసరి రోడ్డులో సుబ్బయ్య, ప్రభావతి దంపతులు కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. అయితే శనివారం ఉదయం సుబ్బయ్య యధావిధిగా దుకాణం వద్దకు వెళ్లారు. దీంతో ప్రభావతి ఒక్కరే ఇంట్లో ఉన్నారు. ఈ సమయంలో ముఖానికి మాస్క్, చేతులకు గ్లౌజులు వేసుకుని అక్కడకు ఓ వ్యక్తి వచ్చారు. ఆ దుండగుడు ప్రభావతిని బెదిరించి ఆమె ఒంటిపై ఉన్న బంగారు గాజులు, తాళిబొట్టును లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు. బంగారు గాజులు ఆరు తులాలు, తాళిబొట్టు మరో ఆరు తులాలు ఉంటాయి. దీంతో షాక్ తిన్న ప్రభావతి వెంటనే ఈ విషయాన్ని భర్త సుబ్బయ్యకు తెలియజేశారు. ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
బాధితుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. అయితే బాధితులు గుమస్తా రసూల్ మీద అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు సాగించారు. ఈ క్రమంలోనే ప్రొద్దుటూరు టూటౌన్ బైపాస్‌రోడ్డు సమీపంలో రసూల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి బంగారం ఆభరణాలు, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు.