విజయవాడ, మచిలీపట్నం / మల్లవల్లి (హనుమాన్ జంక్షన్): రాష్ట్రంలో వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్యపరంగా వేగవంతంగా పని పనిచేస్తోందని (స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
బుధవారం సాయంత్రం ఆయన రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ ద్వారక తిరుమలరావు, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, అశోక్ లే ల్యాండ్ కంపెనీ ప్రతినిధులతో కలిసి బాపులపాడు మండలం మల్లవల్లిలోని అశోక్ లే ల్యాండ్ నూతన బస్సు ఉత్పత్తి యూనిట్ ను ప్రారంభించారు.
తొలుత మంత్రి అశోక్ లే ల్యాండ్ యూనిట్ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద నుంచి కంపెనీ తయారు చేసిన నూతన విద్యుత్ (డబల్ డెకర్) బస్సులో ప్లాంట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆయన మొక్కను నాటిన అనంతరం రిబ్బన్ కత్తిరించి ప్లాంటును ప్రారంభోత్సవం చేశారు. ప్లాంట్ లోపల అశోక్ లే ల్యాండ్ కంపెనీ చరిత్రను తెలియజేస్తూ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించారు.
అనంతరం కంపెనీ తయారు చేసిన వివిధ రకాల విద్యుత్ వాహనాలలో లోపలికి ప్రవేశించి ఆసక్తిగా పరిశీలించారు. పిమ్మట మంత్రి జెండా ఊపి కంపెనీ నూతన విద్యుత్ బస్సులను ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 90 రోజుల్లో అశోక్ లేలాండ్ ఉత్పత్తిని ప్రారంభించినందుకు సంస్థ యాజమాన్యాన్ని అభినందిస్తున్నామన్నారు.
2023 ఆగస్టు 24వ తేదీన తాను ఎన్నికల పాదయాత్రలో ఇక్కడికి వచ్చినప్పుడు మరల అశోక్ లేలాండ్ ఉత్పత్తి యూనిట్ ప్రారంభించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చానన్నారు. ప్రస్తుతం ప్రారంభ కార్యక్రమంలో పాలుపంచుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
2019-24 మధ్య కాలంలో పరిశ్రమలు నెలకొల్పుటకు చాలా ఇబ్బందుల ఎదురయ్యాయన్నారు. పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు రద్దు అయ్యాయన్నారు. దీంతో పారిశ్రామిక రంగంలో ఒక అభద్రతాభావం ఏర్పడిందన్నారు.
పారిశ్రామికవేత్తలు ముఖ్యంగా అశోక్ లేలాండ్ అమర్ రాజా వంటి ప్రముఖ కంపెనీలు తమ పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టాలా వద్దా పునరాలోచనలో పడ్డాయన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ఒకదానికొకటి అనుసంధానమై వెళ్లాల్సి ఉందని ప్రజలందరూ కోరుకున్నారన్నారు.
2018లో అప్పటి ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు అశోక్ లేలాండ్ యూనిట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారని చేశారన్నారు. రాష్ట్రంలో వ్యాపారం పున ప్రారంభించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఆ దిశగా దృష్టి సారించి మరల అశోక్ లేలాండ్ వంటి సంస్థలను ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందన్నారు
ఆ ప్రకారంగా రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని అశోక్ లేలాండ్ యాజమాన్యానికి చెప్పడం జరిగిందన్నారు. ముఖ్యంగా నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని వారిని కోరామన్నారు.
మొత్తం 75 ఎకరాల్లో మొదటి దశలో 45 ఎకరాలు అభివృద్ధి పరిచారన్నారు. సంవత్సరానికి 2,400 బస్సులు తయారీ సామర్థ్యంతో ఈ ప్లాంట్ మొదలైందని భవిష్యత్తులో 4 వేల బస్సులు తయారయ్యే దిశగా ముందడుగు వేయనుందన్నారు.
ఈ కంపెనీలో రాష్ట్రంలోని యువతి యువకులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కార్మికులు పనిచేస్తున్నారని, ముఖ్యంగా మొదటి దశలో రాష్ట్రంలోని 600 మందికి ఉపాధి అవకాశాలు లభించడం గొప్ప విషయం అన్నారు.
రెండవ దశలో ఏపీఎస్ఆర్టీసీ సహకారంతో మరింత పురోభివృద్ధి సాధించి మరో రెండువేల ఉద్యోగాలు లభించనున్నాయన్నారు. దీంతో నిరుద్యోగుల కుటుంబాలు పేదరికం నుండి బయటపడేందుకు వీలుందన్నారు. అశోక్ లేలాండ్ ప్రైమరీ ఉద్యోగాలతో పాటు సెకండరీ ఉద్యోగాలు అందించండానికి సిద్ధంగా ఉందన్నారు.
ఈ ప్లాంట్లులో కటింగ్ ఎడ్జ్డ్ బస్సుల నిర్మాణమే కాకుండా విద్యుత్ బస్సులు కూడా తయారు కావడం శుభ పరిణామన్నారు. అశోక్ లే లాండ్ కంపెనీ ప్రధాన మంత్రి ఆత్మ నిర్భర్ భారత్ దార్శనికతలో భాగం అన్నారు. ప్రజలందరూ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎదురుచూస్తున్నారన్నారు.
అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్ఠాత్మక అశోక్ లే ల్యాండ్ సంస్థ ఉత్పత్తి ప్రారంభించడం సంతోషంగా ఉందని, ఇలాంటి పరిశ్రమలు తెచ్చే ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకే దక్కుతుందన్నారు. నాడు శంకుస్థాపన చేసినపుడు ఏపీకి తలమానికంగా నిలుస్తుందని భావించామని, అతి తక్కువ కాలంలోనే ప్రారంభానికి సిద్ధమైనప్పటికీ గత పాలకుల నిర్లక్ష్యానికి గురై ఉత్పత్తి చేయలేకపోయిందన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజల కోసం, యువతకు ఉద్యోగాలు కల్పించడం కోసం ఎంతో శ్రమిస్తున్నారని, అధికారంలోకి రాగానే ప్రధానిని తీసుకొచ్చి 2 లక్షల కోట్ల పెట్టుబడులకు శ్రీకారం చుట్టారని అన్నారు. అదే బాటలో మంత్రి లోకేష్ జూమ్ కాల్ లో మాట్లాడి విశాఖలో ఆర్సెల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ను తీసుకొచ్చిన సందర్భాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అశోక్ లేలాండ్ ఉత్పత్తులు దేశ విదేశాలకు తరలించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని, జల రవాణాను ప్రోత్సహిస్తూ పారిశ్రామిక రంగానికి చేయుతనిచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆటో మొబైల్ రంగంలో అశోక్ లే ల్యాండ్ రికార్డులు సృష్టిస్తుందని, రాష్ట్ర భవిష్యత్తుకు తలమానికంగా నిలుస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర ఆశా భావం వ్యక్తం చేశారు.
స్థానిక శాసన సభ్యులు యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ 2023లో మల్లవల్లి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం నిలిచిపోయిన అశోక్ లే ల్యాండ్ యూనిట్ ను తిరిగి నేడు ప్రారంభించి తన మాట నిలబెట్టుకున్నారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కట్టుబడి ఉందని, ఆ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్ర కృషి చేస్తున్నారన్నారు.
గన్నవరం నియోజకవర్గంలో 15 వేల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే లక్ష్యంగా కృషి చేస్తున్నామని, ఆ దిశగా ఇప్పటికే జాబ్ మేళాలు నిర్వహిస్తూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, ఇది నిరంతరం కొనసాగుతుందన్నారు. నియోజకవర్గంలో ఉద్యోగకల్పనలో కీలకమైన మల్లవల్లి పారిశ్రామికవాడను మరింత అభివృద్ధి చేస్తామని, పరిశ్రమల ఏర్పాటుతో రాబోయే రోజుల్లో మల్లవల్లి దేశంలో మేటిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.
రాష్ట్ర విద్యా శాఖ, మరియు ఐ.టి. శాఖామంత్రి నారా లోకేష్ కు అపూర్వ స్వాగతం
ఘన స్వాగతం పలికిన రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి
విజయవాడ/నూజివీడు: గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో గల పారిశ్రామిక కేంద్రంలో నిర్మించిన అశోక్ లైలాండ్ కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యా శాఖ, మరియు ఐ.టి. శాఖామంత్రి, నారా లోకేష్ కు నూజివీడు నియోజకవర్గంలోని నూజివీడు మండలం, మర్రిబంధం, సీతారాంపురం పోలవరం కాలువ వారధి కూడలిలో విశేష జనాభాతో, పార్టీ కార్యకర్తలు, నాయకులతో, భారీ గజ మాలతో రాష్ట్ర గృహనిర్మాణ మరియు సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ, తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు,పెద్ద ఎత్తున పాల్గొని నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో హిందూజా గ్రూప్ చైర్మన్ అశోక్ పి హిందూజా, అశోక్ లే ల్యాండ్ చైర్మన్ ధీరజ్ హిందూజా, ఎండి సీఈవో షేను అగర్వాల్, ఏపీఐఐసీ వైస్ చైర్మన్ ఎండి ఎం.అభిషిక్త్ కిషోర్, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు, పరిశ్రమల శాఖ జోనల్ మేనేజర్ సీతారామ్, గుడివాడ ఆర్డీవో బాలసుబ్రమణ్యం, అశోక్ లే ల్యాండ్ కంపెనీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.