ప్ర‌పంచంలో ఎక్క‌డాలేని విధంగా పీ-4 విధానం అమ‌లు: మంత్రివ‌ర్యులు కొలుసు పార్థ‌సార‌థి



- పేద‌రిక నిర్మూల‌న ల‌క్ష్యంగా వినూత్న కార్య‌క్ర‌మం
- భావిత‌రాల బంగారు భ‌విష్య‌త్తు ల‌క్ష్యంగా మార్గ‌ద‌ర్శి-బంగారు కుటుంబం
- సామాజిక న్యాయం కోసం ఫూలే కృషిచేస్తే ఆర్థిక సామాజిక న్యాయం కోసం ముఖ్య‌మంత్రి కృషిచేస్తున్నారు
- రాష్ట్ర గృహ నిర్మాణం, స‌మాచార‌, పౌర సంబంధాల శాఖ మంత్రివ‌ర్యులు కొలుసు పార్థ‌సార‌థి

నూజివీడు/ఆగిరిపల్లి/ఏలూరు: ప్ర‌పంచంలో ఎక్క‌డాలేని విధంగా రాష్ట్రంలో గౌర‌వ ముఖ్య‌మంత్రి దార్శ‌నిక‌త‌కు అనుగుణంగా జీరో పావ‌ర్టీ-పీ 4 విధానం అమ‌లవుతోంద‌ని రాష్ట్ర గృహ నిర్మాణం, స‌మాచార‌, పౌర సంబంధాల శాఖ మంత్రివ‌ర్యులు కొలుసు పార్థ‌సార‌థి అన్నారు. 

శుక్ర‌వారం నూజివీడు నియోజ‌క‌వ‌ర్గం, ఆగిరిప‌ల్లిలో మ‌హాత్మా జ్యోతిబా ఫూలే జ‌యంతి వేడుక‌ల‌తో పాటు జీరో పావ‌ర్టీ-పీ 4 ప్ర‌జా వేదిక కార్య‌క్ర‌మంలో మంత్రి కొలుసు పార్థ‌సార‌థి పాల్గొని మాట్లాడారు.
గొప్ప సంఘ సంస్క‌ర్త‌, అణ‌గారిన వ‌ర్గాల సంక్షేమం కోసం అహ‌ర్నిశ‌లు కృషిచేసిన మ‌హాత్మా జ్యోతిబా ఫూలే జ‌యంతి సంద‌ర్భంగా పీ-4 ప్ర‌జా వేదిక కార్య‌క్ర‌మం నూజివీడు నియోజ‌క‌వ‌ర్గంలో జ‌ర‌గ‌డం చాలా ఆనందంగా ఉంద‌న్నారు. 

బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల‌కు ఆత్మ‌గౌర‌వం క‌ల్పించాల‌ని, వివ‌క్ష‌ను రూపుమాపాల‌ని దాదాపు 200 ఏళ్ల క్రిత‌మే ఫూలే గొప్ప పోరాటం చేశార‌ని పేర్కొన్నారు. ప‌రిపాల‌న అంటే 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు, 25 పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాలే కాద‌ని.. ప‌రిపాల‌న అంటే అయిదు కోట్ల ప్ర‌జ‌ల సంక్షేమం అని గొప్ప ప‌రిపాల‌నా ద‌క్ష‌త చూపుతూ గౌర‌వ ముఖ్య‌మంత్రి ప‌నిచేస్తున్నార‌ని పేర్కొన్నారు.


దాదాపు 75 శాతం మేర ఉన్న ఎస్‌సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ త‌దిత‌ర వ‌ర్గాల సంక్షేమం, అభ్యున్న‌తికి కృషిచేస్తున్నార‌న్నారు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీ త‌దిత‌ర వ‌ర్గాల పిల్ల‌ల‌కు మంచి భ‌విష్య‌త్తును అందించాల‌నే గొప్ప ల‌క్ష్యంతో ప‌నిచేస్తున్నార‌న్నారు. రాష్ట్రాన్ని ఓ గొప్ప స్థానానికి ముఖ్య‌మంత్రి తీసుకెళ్తే గ‌త అయిదేళ్ల‌లో అన్ని రంగాల్లోనూ విధ్వంసం సృష్టించార‌ని, అప్పుల త‌ట్ట‌ను నెత్తిన పెట్టి వెళ్లిపోయార‌ని పేర్కొన్నారు. దాదాపు 10 ల‌క్ష‌ల కోట్లు అప్పులు పెట్టార‌న్నారు. 

అయినా అపార అనుభ‌వం, గొప్ప దార్శ‌నిక‌త ఉన్న ముఖ్య‌మంత్రివ‌ర్యులు చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రాన్ని తిరిగి గాడిన‌పెడుతున్నార‌ని.. దేశంలోనే నెం.1 దిశ‌గా అడుగులేయిస్తూ న‌డిపిస్తున్నార‌ని పేర్కొన్నారు.

సూప‌ర్‌-6 ప‌థ‌కాల అమ‌లుపై ప్ర‌త్యేకంగా దృష్టిసారిస్తున్నార‌ని.. సంక్షేమంతో పాటు అభివృద్ధికీ ప్రాధాన్య‌మిస్తున్నార‌న్నారు. మ‌న‌కు కూత‌వేటు దూరంలోని మ‌ల్ల‌వ‌ల్లి నుంచి కోట్లాది రూపాయ‌లు పెట్టుబ‌డి పెట్టిన‌వారు సైతం మూత‌లేసుకొని వెళ్లిపోయార‌ని.. అయితే మ‌న ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత అక్క‌డ అశోక్ లేల్యాండ్ ప్రారంభ‌మైంద‌ని, చాక్లెట్ ఫ్యాక్టీరీ కూడా ప్రారంభ‌మ‌వుతోంద‌ని, ఇలాంటి వాటివ‌ల్ల యువ‌త‌కు పెద్దఎత్తున ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌న్నారు.


యువ‌నేత నారా లోకేశ్ ఒక్క జూమ్ కాల్‌తోనే దాదాపు ల‌క్షా 30 వేల కోట్ల‌తో ఆర్సెల్లార్ మిట్ట‌ల్ స్టీల్ ప్లాంట్ రాష్ట్రానికి వ‌చ్చింద‌ని.. ఇందుకు సంబంధించి క్యాబినెట్‌లో వివిధ నిర్ణ‌యాలు జ‌రిగాయ‌ని వివ‌రించారు. ఆర్థిక స‌మ‌స్య‌లున్న‌ప్ప‌టికీ ఎస్‌సీ, ఎస్టీల‌తో పాటు బీసీల‌కు సొంతింటి కోసం రూ. 3,500 కోట్ల అద‌న‌పు భారాన్ని ప్ర‌భుత్వం మీదేసుకుంద‌ని తెలిపారు. పుణ్య‌భూమి, జ‌న్మ‌భూమికి సేవ చేయాల‌నే త‌ప‌న‌తో పేద‌రికంలో ఉన్న‌వారిని పైకి తీసుకురావాల‌నే స్ఫూర్తిని నింపేందుకు పీ4 కార్య‌క్ర‌మం అమ‌ల‌వుతోంద‌ని తెలిపారు.

రాష్ట్రంలోని దాదాపు కోటి 50 ల‌క్ష‌ల కుటుంబాల్లో ప్ర‌తి కుటుంబం నుంచి ఒక వ్యాపార‌వేత్త ఉండాల‌నేది ముఖ్య‌మంత్రి ఆశ‌యం అని.. ఉన్న నైపుణ్యాల‌ను ఉప‌యోగించుకుంటూ, ప్ర‌భుత్వ స‌హకారాన్ని స‌ద్వినియోగం చేసుకుంటూ వ్యాపార‌వేత్త‌లుగా ఎద‌గాల‌ని మంత్రివ‌ర్యులు కొలుసు పార్థ‌సార‌థి అన్నారు.. జిల్లాలోని నూజివీడు, చింతలపూడి వంటి మెట్ట ప్రాంత భూములను సస్యశ్యామలం చేసేందుకు చింతలపూడి ఎత్తిపోతల పధకాన్ని పూర్తి చేయాలనీ, పోలవరం కుడి ప్రధాన కాలువ నుండి లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరుచేస్తే, 20 వేల ఎకరాలకు సాగునీరు అందితుందన్నారు.


ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతూ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాను పారిశ్రామికంగా ముందుకు తీసుకువెళుతున్నామన్నారు. పీ4 సర్వే లో జిల్లాలో 99 వేల మంది అత్యంత నిరుపేదలుగా గుర్తించామన్నారు. ఈ కుటుంబాలను మార్గదర్శకులు సహకారంతో అభివృద్ధిలోకి తీసుకువచ్చేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు.           
 
ఆగిరిపల్లికి సి.ఎం. వరాలు:
ఆగిరిపల్లిలో సిసి రోడ్లు, డ్రైనేజి సౌకర్యాలు పూర్తిస్థాయిలో కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఆగిరిపల్లిలో 12 కిలోమీటర్లకు గాను 4.2 కిలోమీటర్లే సిసి రోడ్లు ఉన్నాయని, 20 కిలోమీటర్ల డ్రైనేజి కల్పించాల్సి ఉండగా, ఒక కిలో మీటర్ మాత్రమే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉందని, వీటిని రానున్న మూడు సంవత్సరాలలో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలనీ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.