రూపాయికి ఇడ్లీయే రాదు.. ‘ఉర్సా’ భూ కేటాయింపులపై మాజీ సీఎం జగన్ ధ్వజం


ANDRAPRADESH, VISAKHAPTNAM: కూటమి ప్రభుత్వంలో భూ కేటాయింపులపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖలో వేల కోట్ల రూపాయల భూములను కారుచౌకగా కట్టబెడుతున్నారని మండిపడ్డారు. రూపాయికి ఇడ్లీ అయినా వస్తుందో లేదో తెలియదు కానీ, ఉర్సా లాంటి కంపెనీలకు మూడు వేల కోట్ల విలువైన భూములు దోచిపెట్టారని ఆరోపించారు. అదేవిధంగా లులు మాల్ పేరిట ఎలాంటి టెండర్లు లేకుండా రూ.1500 కోట్ల భూ సంతర్పణ చేశారని జగన్ మండిపడ్డారు.


తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రతినిధులతో మాజీ సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో ఎక్కడికక్కడ బెల్టుషాపులు, మద్యం దుకాణాలు వెలిశాయని, మద్యం విచ్చలవిడి అమ్మకాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి బాటిల్ పైన రూ.20 అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఉచిత ఇసుక పేరుతో రెండింతలు ఎక్కువ దోచేస్తున్నారని చెప్పారు. ప్రజల దృష్టి మళ్లించడానికి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 

రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చెప్పిన జగన్ హామీలు అమలు చేయని టీడీపీ ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీస్తున్నారని చెప్పారు. టీడీపీ నేతలు ధైర్యంగా గ్రామాల్లో తిరగలేకపోతున్నారని తెలిపారు. విద్య, వైద్య రంగాలను దారుణంగా మార్చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో నాలుగు లక్షల పింఛన్లను తీసేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ప్రజా వ్యతిరేకతను అణిచివేయడం టీడీపీ ప్రభుత్వానికి సాధ్యం కాదని తెలిపారు. 

సమావేశానికి ముందు జమ్మూకశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం ప్రకటించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి హతులకు నివాళులర్పించారు. కాగా, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న భూ కేటాయింపులపై జగన్ తొలిసారి మాట్లాడారు. ఇప్పటికే విశాఖలో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు భూ కేటాయింపులపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు మాజీ సీఎం కూడా అదే విషయంపై మాట్లాడటంతో ప్రభుత్వం ఏం చెబుతుందనేది ఆసక్తికరంగా మారింది.