ANDRAPRADESH: శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ డోంట్ కేర్ అంటున్నారు. నా దగ్గర కేసులు గీసులు జాంతానై అంటున్నారు. నా మీద కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి, భయపడేది లేదు, ఒకేసారి జననం ఒకేసారి మరణం అని వేదాంతం కూడా వల్లిస్తున్నారు ఆయన. ఎందుకు భయం ఎవరికి భయం. దేనికి భయం అంటూ ఎర్రెర్రని డైలాగులు కొడుతున్నారు.
అవును నేను పొగరు ఉన్న వాడిని. జంకేది లేదు, ఎవరో కేసులు పెడతారని ఆగేదీ లేదు. అయినా ఇప్పటికి ఇరవై ఏళ్ళ క్రితమే 2000 రోజుల పాటు జైలులో ఉన్న వాడిని, నాకు భయం ఎందుకు అని ఆయన ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టుకుంటే నేను రెడీ. జైలుకు పోవడానికి రెడీ అని ఆయన అంటున్నారు. తాను ఏ తప్పూ చేయలేదని ఆయన అంటున్నారు. తన రాజకీయ జీవితంలో ఫలానా తప్పు చేశాను అని చెప్పి దానిని ఆధారాలతో రుజువు చేసి మరీ కేసు పెడితే సంతోషిస్తాను అన్నారు.
తాను అవినీతి అక్రమాలు చేయలేదని అన్నారు. తప్పు చేసిన వారు మా పార్టీ వారు అయినా జడుస్తారని తాను ఏ తప్పూ చేయలేదు కాబట్టే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానని ఆయన అంటున్నారు. సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చమని కోరితే జైలులో పెడతారా కేసులు కడతారా అని ఆయన అంటున్నారు. తాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఏమీ అనలేదని అంటూనే ఆయన 31 వేల మహిళలు వైసీపీ ప్రభుత్వంలో కనిపించలేదని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ మహిళలను తిరిగి వెనక్కి తీసుకుని రావాలని తాను కోరుతున్నాను అని అన్నారు.
దీని మీద జనసైనికులు గుస్సా అయ్యారని తన మీద పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు అని ఆయన అన్నారు తాను వైసీపీకి దూరం కాలేదని, జగన్ కి కూడా దూరం కాలేదని మరో మాట అన్నారు. తాను ప్రాణం ఉన్నంతవరకూ జగన్ తోనే తన రాజకీయ జీవితం అన్నారు. తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని అందువల్ల ప్రతిపక్షంగా ప్రజా పక్షంగా కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనను ఎదిరిస్తాను అని దువ్వాడ అంటున్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక తాను గతంలో చేసిన కాంట్రాక్టు బిల్లులు ఆపారని ఆయన చెప్పారు. అలాగే తన వ్యాపారాలను దెబ్బ తీశారని అన్నారు. కోట్లాది రూపాయల నష్టం దీని వల్ల తనకు కలిగిందని ఆయన చెప్పారు. అయినా డోంట్ కేర్ అన్నారు. డబ్బుల కోసం తాను తగ్గేది లేదని తన బాట రాచబాట అంటున్నారు.
తాను హైదరాబాద్ లో టెక్కలిలో చెరి మూడు రోజులూ ఉంటానని తాను ఎయిర్ పోర్టు నుంచి కారులోనే తన ఇంటికి వస్తానని తనను ఎక్కడైనా అరెస్ట్ చేసుకోవచ్చు అని దువ్వాడ సవాల్ విసురుతున్నారు. శ్రీకాకుళం జిల్లాకు కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదని ఆయన విమర్శించారు. మొత్తానికి దువ్వాడ అరెస్ట్ చేసుకోమంటున్నారు. ఆ మధ్య ఆయన హైదరాబాద్ లో ఉండగా పోలీసులు ఆఉయనకు నోటీసులు ఇచ్చారని ప్రచారం సాగింది.
తరువాత అరెస్టు ఆయనదే అన్నంతగా చర్చ జరిగింది. మరి ఇప్పటిదాకా ఆయన అరెస్ట్ కాలేదు, అయితే తాను ఎపుడైనా ఎక్కడైనా రెడీ అంటున్న దువ్వాడ సవాల్ మీద కూటమి రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సిందే.