ANDRAPRADESH: ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ అరెస్టు వ్యవహారం కూడా ఇంచుమించు ఇలానే చూడాలా? అనే చర్చ జరుగుతోంది. సొర పట్టాలంటే ఎర వేయాలి.. ఇది సినిమా డైలాగే కావొచ్చు. వాస్తవం కూడా అదే.. ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ అరెస్టు వ్యవహారం కూడా ఇంచుమించు ఇలానే చూడాలా? అనే చర్చ జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సతీమణి వైఎస్ భారతిపై అభ్యంతర వ్యాఖ్యలు చేసిన కిరణ్ ను ఆఘమేఘాలపై అరెస్టు చేయించిన ప్రభుత్వం.. వైసీపీలోని కొందరు ముఖ్యమైన వ్యక్తులను కటకటాల వెనక్కి పంపేందుకు ఈ కేసును ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయనే అనుమానిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ సోషల్ మీడియాను పూర్తిస్థాయిలో అదుపు చేయాలని చూసింది. వరుస అరెస్టులతో హడలెత్తించింది. సామాన్య కార్యకర్త నుంచి సినీ నటుడు, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ పోసాని వరకు అన్ని స్థాయిల్లోనూ వైసీపీ సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపింది. ఇక రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ వంటివారు ఇప్పటికీ బెయిల్ తెచ్చుకోలేక జైలులోనే మగ్గిపోతున్నారు.
ఇదే సమయంలో బహిరంగ క్షమాపణలు వేడుకున్న సినీనటి శ్రీరెడ్డి వంటివారిని క్షమించి వదిలేసింది. కానీ, తన కార్యకర్త చేబ్రోలు కిరణ్ విషయంలో ప్రభుత్వం కఠిన వైఖరి వ్యవహరించింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే అతడి చేత క్షమాపణ వీడియో విడుదల చేయించినా, అరెస్టు నుంచి మాత్రం మినహాయించలేదు. దీంతో కూటమి ప్రభుత్వం నష్టనివారణ చర్యలు తీసుకున్నట్లైంది. అయితే ఇక్కడే ప్రభుత్వ వ్యూహం దాగుందని అంటున్నారు.
వైసీపీలో చాలావరకు సోషల్ మీడియా అరెస్టు చేసినా, ఇంకొందరు ముఖ్యులు ఇప్పటికీ తప్పించుకు తిరుగుతున్నారని టీడీపీ సోషల్ మీడియా ఆరోపిస్తోంది. తమ సహచరుడు తప్పు చేసినా, సరే వైసీపీలో ఇంకొందరి విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని సొంత కార్యకర్తలతో విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ పరిస్థితిని ముందే ఊహించిన ప్రభుత్వం.. కిరణ్ విషయంలో ఎంత కఠినంగా వ్యవహరించామో.. ఇతరుల విషయంలోనూ అదే రూల్స్ పాటిస్తామని చెప్పేందుకు తమ కార్యకర్తపై చర్యలు తీసుకుందని అంటున్నారు. ఆదిలోనే ఇలాంటి వాటిని అరికట్టామనే మార్కులు కొట్టేయడంతోపాటు వైసీపీలో మిగిలిన వారినీ వేటాడేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కిరణ్ అరెస్టు సమయంలోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడిపై అనుచితంగా వ్యాఖ్యలు చేసిన ఓ సోషల్ మీడియా కార్యకర్తపైనా కేసులు నమోదు చేశామని గుంటూరు ఎస్పీ ప్రకటించారు. దీంతో రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అన్నట్లు వైసీపీలో అనుచిత పోస్టులు పెట్టిన ఏ ఒక్కరినీ ఇప్పట్లో వదిలేది లేదని ప్రభుత్వం సంకేతాలు పంపిందని అంటున్నారు. అంతేకాకుండా కిరణ్ అరెస్టు ఎపిసోడ్ ద్వారా వైసీపీని కూడా ఆత్మరక్షణలోకి నెట్టివేసినట్లు చెబుతున్నారు.
తమ కార్యకర్తతో క్షమాపణ చెప్పించడమే కాకుండా, అరెస్టు చేయించామని, గతంలో వైసీపీ కార్యకర్తల విషయంలో ఆ పార్టీ ఇలా చేయలేదని ప్రచారం చేస్తోంది. దీంతో భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం వెనక్కివెళ్లి.. గతంలో వైసీపీ కార్యకర్తలు మాట్లాడిన మాటలే మళ్లీ ముందుకు వస్తున్నాయంటున్నారు. ఏదిఏమైనా సరే ప్రభుత్వ వ్యూహంతో వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తుందనే టాక్ వినిపిస్తోంది.