ఒంటిమిట్ట ఆలయంలో రాములవారి కల్యాణం శ్రీరామనవమి రోజున ఎందుకు చేయరు?


ANDRAPRADESH: ప్రతి ఏటా శ్రీరామ నవమి రోజున తెలంగాణలోని భద్రాచలంతో సహా అన్ని రామాలయాల్లో మధ్యాహ్నం పూట, అభిజిత్ ముహూర్తంలో సీతారాముల కల్యాణం నిర్వహిస్తుంటారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లోని ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో మాత్రం శ్రీరామ నవమి పర్వదినాన కాకుండా నాలుగైదు రోజులు (తిథుల ప్రకారం) ఆలస్యంగా చతుర్దశి పౌర్ణమి రోజున కల్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అది కూడా సంధ్యకాలంలో, వెన్నెల వెలుగుల్లో కల్యాణం నిర్వహిస్తారు.

ఒంటిమిట్ల రాములోరి కల్యాణం మాత్రమే ఇలా ఎందుకు నిర్వహిస్తారు అనే విషయాలను కోదండ రామస్వామి ఆలయ ప్రధాన అర్చకులు వీణ రాఘవాచార్యులు బిసిఎన్ కి వివరించారు.

చతుర్దశి రాత్రి పున్నమి ఘడియలు సమీపిస్తున్న సమయంలో, వెన్నెల రాత్రిలో సీతారామ కల్యాణం జరగడానికి వెనుక రెండు పురాణగాథలు ఉన్నాయని రాఘవాచార్యులు చెప్పారు.


'చంద్రుడికి శ్రీరాముడి వరం'
''శ్రీరాముడు మధ్యాహ్నం 12 గంటలకు జన్మించినప్పుడు ముక్కోటి దేవతలు హాజరయ్యారట. సూర్యాస్తమయం తర్వాతే చంద్రుడు రావాలి. కానీ సూర్యుడు అస్తమించకుండా ఉండిపోవడంతో చంద్రుడు శ్రీరాముడిని చూడ్డానికి రాలేకపోయాడు. రాలేకపోయానని చంద్రుడు ముభావంగా ఉండడం గమనించిన శ్రీరాముడు, నేను రామచంద్రుడు అని నీ పేరే పెట్టుకుంటానని సముదాయిస్తాడు.

అప్పటికీ చంద్రుడిలో మార్పు రాకపోవడంతో ద్వాపర యుగంలో రాత్రి 12 గంటలకు కృష్ణావతారంలో జన్మిస్తానని చెప్పినా చంద్రుడు బాధపడుతూనే ఉంటాడట. నీకోసం ఒంటిమిట్టలో వెన్నెల రాత్రిలో నా కల్యాణం జరిపించుకుంటానని చెప్పిన తర్వాత చంద్రుడు సంతోషించాడని ఒక కథ ఉంది'' అని రాఘవాచార్యులు తెలిపారు.

ఇక రెండో కథ ప్రకారం, 
''పాలసముద్రాన్ని చిలుకుతున్నప్పుడు చంద్రుడు, లక్ష్మీదేవి జన్మించారని పురాణాలు చెబుతున్నాయి. కలిసి జన్మించారు కాబట్టే చంద్రుడిని చందమామ అంటాం. మరోవిధంగా చూస్తే రాముల వారిది సూర్యవంశం, సీతాదేవిది చంద్రవంశం.

భారతీయ సంస్కృతిలో కన్యాదానం చేసే వధువు తరఫు వారికి అనుకూల సమయం వెన్నెల రాత్రి కాబట్టి, సీతారామ కల్యాణం కూడా వెన్నెల రాత్రి చేస్తారు అనేది పురాణం'' అని రాత్రి పూట కల్యాణం వెనకున్న పురాణగాథలను వివరించారు.


ప్రాచీన ఆలయం
ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్న ఒంటిమిట్ట కోదండ రామాలయం పురాతన ఆలయాల్లో ఒకటి. ఇక్కడ కోదండరాముడు, సీతాదేవి, లక్ష్మణులు కొలువైవున్నారు. కడప నుంచి తిరుపతికి వెళ్లే మార్గంలో, 27 కిలోమీటర్ల దూరంలో ఒంటిమిట్ట ఉంటుంది.

రాష్ట్ర విభజనానంతరం నుంచి ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఒంటిమిట్టలో శ్రీరామ నవమి వేడుకలు నిర్వహిస్తోంది. ఈ ఆలయ నిర్వహణను ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానముల బోర్డుకు అప్పగించింది.

అప్పటి నుంచి ఆలయ నిర్వహణతో పాటు సీతారామ కల్యాణ వేడుకలను టీటీడీనే నిర్వహిస్తూ వస్తోంది. ఈ ఏడాది, ఏప్రిల్ 11న ఇక్కడ కల్యాణం నిర్వహిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.

హనుమంతుడు లేని రామాలయం
ఒంటిమిట్ట ఆలయంలోని మూల విగ్రహంలో ఒకే శిలలో రాముడు, సీత, లక్ష్మణుల విగ్రహాలు చెక్కారు. ప్రతి రామాలయంలో సీతారామలక్ష్మణుల పక్కన హనుమంతుడి విగ్రహం కనిపిస్తుంది. కానీ, ఈ ఆలయంలో హనుమంతుని విగ్రహం ఉండదు. దీని వెనుక కూడా ఒక పురాణగాథ ఉందని రాఘవాచార్యులు చెప్పారు.

''పూర్వకాలంలో మునులు యాగం చేస్తున్నప్పుడు రాక్షసుల బాధ ఎక్కువై రాముడిని ప్రార్థిస్తే, ఆ సమయంలో రాముడు కోదండము, పిడిబాకు పట్టుకొని ఆ యాగాన్ని రక్షించాడని, అదే సమయంలో ఇక్కడ వెలిశారని కథ ప్రచారంలో ఉంది. అప్పటికి రాములవారికి ఆంజనేయస్వామి పరిచయం కాలేదు కాబట్టి ఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహం ఉండదని చెబుతారు'' అని ఆయన అన్నారు. సీతారామలక్ష్మణుల విగ్రహాలు ఏకశిలలోనే ఉండడంతో ఈ క్షేత్రానికి ఏకశిలా నగరం అనే పేరు కూడా ఉందని కూడా అర్చకులు చెబుతున్నారు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు భద్రాచలం చాలా ప్రత్యేకంగా ఉండేది. రాష్ట్రం విడిపోయాక మనకు ఒంటిమిట్ట రావడం చాలా భాగ్యం చేసుకున్నాం, కడప జిల్లా వాసులుగా మాకు చాలా సంతోషంగా ఉందని భక్తులు విశాలాక్షి, స్వప్న బిసిఎన్ తో అన్నారు. ''ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఒకే రాయిపైన సీతారామ లక్ష్మణులు ఉంటారు.''

11వ తేదీ కల్యాణమైతే, వారం ముందు నుంచే ఉత్సవాలు జరుగుతున్నాయని, టీటీడీ వాళ్లు తీసుకున్నప్పటి నుంచి ఏర్పాట్లు బావున్నాయని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘‘వర్షంలో తడవకూడదని వినాయకుడిని మసీదులోకి తీసుకెళ్లారు, అదే సంప్రదాయంగా మారింది’’

అతిపెద్ద గోపురాలలో ఇదొకటి
ఒంటిమిట్ట రాజగోపురం నిర్మాణం చోళ శిల్ప శైలిలో ఉంటుంది. ఫ్రెంచి యాత్రికుడు ట్రావెర్నియర్ 16వ శతాబ్దంలో ఈ రామాలయాన్ని సందర్శించినప్పుడు భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటని చెప్పారని చరిత్రకారులు చెబుతారు.

ఇక్కడ శిల్పకళ అద్భుతమని రాజంపేటకు చెందిన ప్రొఫెసర్ నర్మద బిసిఎన్ తో అన్నారు.


''ఒంటిమిట్ట దేవాలయం ఆర్కిటెక్చర్‌ పరంగానూ చాలా విశిష్టమైన దేవాలయం. చోళులు, విజయనగరం సామ్రాజ్యం వాళ్లు కట్టారు. మొదలుపెట్టిన వాళ్లు చోళులు. పూర్తి చేసింది విజయనగర సామ్రాజ్యం వారు. రెండు శైలులూ కనిపిస్తాయి''అని ఆమె చెప్పారు.

''రంగ మండపంలో 32 స్తంభాలు ఉంటాయి. మండపం ఓపెన్ ఎయిర్ థియేటర్ లాగా ఉంటుంది.పైన రూఫ్ ఉన్నా గాలి వస్తుంటుంది. ఇక్కడ స్తంభాలు పోలో స్టైల్లో ఉంటాయి. పైన స్ట్రక్చర్ ఉంటుంది, అంటే విగ్రహాలు మలిచి ఉంటాయి.''

విశాల ఆవరణ ఉండే ఒంటిమిట్ట కోదండ రామాలయానికి మూడు గోపుర ద్వారాలు ఉన్నాయి. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు ఉంటుంది. చోళ, విజయనగర వాస్తుశైలి కనిపించే ఆలయ స్తంభాలపై రామాయణ, భాగవత కథలు కూడా కనిపిస్తాయి. ఆలయానికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం. పక్కనే రథశాల, రథం ఉంటాయి.

ఇమాంబేగ్ బావి
ఒంటిమిట్ట శ్రీరాముడి దర్శనానికి వచ్చే భక్తులను ఆకర్షించే అంశాల్లో ఇమాంబేగ్ బావి ఒకటి. ఇమాంబేగ్‌ను 1640వ సంవత్సరంలో కడపను పాలించిన అబ్దుల్ నబీఖాన్ ప్రతినిధిగా చెబుతారు. స్వామి భక్తుడిగా మారిన ఇమాంబేగ్ తాగునీటి అవసరాలకోసం బావిని తవ్వించారని చెబుతారు.

దీని వెనక కూడా ఒక కథ ప్రచారంలో ఉంది.
''ఇమాంబేగ్ ఈ ఆలయానికి వచ్చిన సమయంలో, మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా? అని భక్తులను ప్రశ్నించాడని, చిత్తశుద్ధితో పిలిస్తే కచ్చితంగా పలుకుతాడని సమాధానం చెప్పడంతో ఆయన మూడుసార్లు రాముడిని పిలిచారని చెబుతారు. బదులుగా ఆయనకు మూడు సార్లు ఓ అని సమాధానం రావడంతో ఆయన ఆశ్చర్యపోయారు. అందువల్ల ఆయనపేరు మీదే ఆ బావిని ఇమాంబేగ్ బావి అంటున్నారు.'' అని ప్రచారంలో ఉన్నట్లు స్థానికంగా చెబుతున్నారు.

అందుకే, ఒంటిమిట్ట ఆలయంలో కోదండరాముడిని ముస్లింలు కూడా దర్శించుకుంటారని కూడా వారంటున్నారు. అయితే, ఇప్పుడు ఆ బావి పూడిపోయి ఉంది.