ANDRAPRADESH: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో మరో పంచాయతీ తెరమీదికి వచ్చింది. నిన్న మొన్నటి వరకు అంతర్గత కుమ్ములాట లు సాగితే.. తాజాగా కొత్త వివాదం మరింత వివాదానికి తెరదీసినట్టు అయింది. కుల వివక్ష చూపుతూ.. పిఠాపురంలోని మల్లాం అనే గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గాన్ని వెలివేయడం.. విస్మయానికి గురి చేసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. మల్లాం గ్రామంలో అగ్రవర్ణాలకు చెందిన వారు ఎస్సీ వర్గానికి చెందిన వారిని వెలివేశారని తెలిసింది.
మల్లాం గ్రామంలో అగ్రవర్ణాల ఆధిపత్యం ఎక్కువగా ఉంది. అయితే.. రెండు రోజుల కిందట దళిత వర్గానికిచెందిన సురేష్ అనే వ్యక్తి కరెంటు పనికోసం వచ్చి.. ఓ ఇంట్లో షాక్ కొట్టి చనిపోయాడు. ఆ వెంటనే గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని.. ఇంటి యజమాని ఆర్థికంగా సొమ్ములు ఇచ్చేలా తీర్మానం చేశారు. దీంతో ఎలాంటి కేసు లేకుండా.. సురేష్ అంత్యక్రియలు జరిగిపోయాయి. కానీ.. అంతా అయిపోయిన తర్వాత.. ఇస్తామన్న రూ.2.7 లక్షలను ఇచ్చేందుకు ఇంటి యజమాని తిరస్కరించాడు.
దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సురేష్ కుటుంబ సభ్యులు.. ఇతర దళిత సామాజిక వర్గం నాయకులతో కలిసి.. యజమాని ఇంటి ముందు ధర్నా నిరసన చేశాయి. దీనిని మనసులో పెట్టుకున్న అగ్రవర్ణాలు.. మల్లాం గ్రామంలో దళితులకు ఏమీ విక్రయించకుండా.. పనులు కూడా లభించకుండా.. గత రెండు రోజులుగా ఇబ్బందులు పెడుతున్నారు. తమను పనుల్లోకి రానివ్వడం లేదని.. షాపుల్లో ఏ వస్తువూ తమకు విక్రయించడం లేదని దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు టిపిన్లు సైతం.. విక్రయించని దృశ్యాలు వీడియోల రూపంలో వైరల్ అవుతున్నాయి.
ఈ వ్యవహారం వెలుగులోకి రాగానే ఆర్డీవో.. సహా సీఐ స్థాయి అధికారులు మల్లాంలో పర్యటించి.. సర్దిచెప్పే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఈవివాదం కొనసాగుతూనే ఉంది. కాగా.. ఇది డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం కావడం.. ఆయన దళితులు, ఆదివాసీల పట్ల సానుకూలంగా ఉండడం తెలిసిందే. దీంతోఈ వ్యవహారాన్ని అధికారులు కూడా సీరియస్‌గానే తీసుకున్నారు. మరి ఏం జరుగుతుం దో చూడాలి.