పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా


అగిరిపల్లి/ఏలూరు: ఏలూరు జిల్లా అగిరిపల్లి గ్రామానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పీ4 సర్వే లో భాగంగా కులవృత్తుల వారిని పని ప్రదేశంలో కలుసుకున్నారు. అగిరిపల్లి మార్కెట్ సెంటర్ లో సెలూన్ షాపు నిర్వహిస్తున్న గ్రామంలోని బత్తుల జగన్నాధం సెలూన్ షాపునకు వెళ్లి వారి వివరాలను అడిగితెలుసుకున్నారు.


కుల వృత్తిలో ఎన్ని సంవత్సరాల నుండి ఉంటున్నారు, వారి రోజూ వారి ఆదాయం, పిల్లలు, కుటుంబ ఆర్ధిక పరిస్థితులు, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. జగన్నాధం సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆగిరిపల్లిలోని యాదవ బజారులో బంగారు కుటుంబంలో ఉన్న నక్కనబోయిన కోటయ్య ఇంటికి వెళ్లి కోటయ్యతో మాట్లాడారు. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, వారికి పెళ్లిళ్లు అయ్యాయని, 4గురు మనవాళ్ళు ఉన్నారని ముఖ్యమంత్రికి తెలిపారు. 


తనకు మూడు నాలుగు పాడి గేదెలున్నాయని, 20 గొర్రెలు ఉన్నాయని తానూ, తన పిల్లలు వారి కుటుంబాలు మొత్తం పాడి గేదెలు, గొర్రెల పైన వచ్చే ఆదాయంతోనే జీవిస్తున్నామని కోటయ్య ముఖ్యమంత్రికి విన్నవించారు. గొర్రెల పెంపకానికి షెడ్ మంజూరు చేస్తామని, పిల్లలను చదివించాలని ముఖ్యమంత్రి కోటయ్యకు సూచించారు. పేదల జీవన ప్రమాణాల స్థాయిని పెంచేందుకు తాను పీ4 కార్యక్రమాన్ని అమలు చేస్తున్నానని, వారి కుటుంబం పరిస్థితులు మెరుగుపరిచి, ఆర్థికభివృది కి తోడ్పాటు అందిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కోటయ్య ఇంటిలోకి గేదెలకు గడ్డి వేశారు. ఇంటి పరిసరాలను పరిశీలించారు. కోటయ్య కుటుంబ సభ్యులు అందరితో ముఖ్యమంత్రి సెల్ఫీ దిగారు.