ANDRAPRADESH, KRISHNA, VIJAYAWADA: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఇవాళ జరిగిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి ప్రతీకార దాడులు, చొరబాట్లు జరగవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా తీరాన్ని అప్రమత్తం చేస్తున్నారు. తీర ప్రాంతాల నుంచి తీవ్రవాదులు చొరబడే అవకాశం ఉండటంతో నేవీ మెరైన్ పోలీసు స్టేషన్లను హైఅలర్ట్ చేస్తోంది. దీంతో పాటు తీర గ్రామాల్లోనూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఆపరేషన్ సింధూర్ తర్వాత కృష్ణా జిల్లాలోని సముద్ర తీరంలో హైఅలర్ట్ కొనసాగుతోంది. భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో కేంద్రం తీర ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించింది. సముద్ర మార్గంలో ఉగ్రవాదులు జిల్లాలోకి రాకుండా బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో 110 కిమీ సముద్రతీరం ఉంది. దీని గుండా ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించకుండా గస్తీ పెంచారు.
మరోవైపు కృష్ణాజిల్లా పరిధిలో 3 మెరైన్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో పాలకాయతిప్ప (కోడూరు మండలం), గిలకలదిండి (మచిలీపట్నం), ఒర్లగొందితిప్ప (కృత్తివెన్ను మండలం) మెరైన్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 150 మంది సిబ్బంది ఉన్నారు. ప్రతి సముద్ర తీర గ్రామంలో మెరైన్ పోలీసులతో పాటు రెండు డ్రోన్ కెమెరాలతో పహారా కాస్తున్నాయి. అదే సమయంలో తీర గ్రామాల ప్రజలను మెరైన్ పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. మచిలీపట్నం మెరైన్ పోలీస్ స్టేషన్ పరిథిలో ప్రస్తుతం మెరైన్ బోట్లు వినియోగంలో లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి కొత్త బోట్లను రప్పిస్తున్నారు.