ANDRAPRADESH, KADAPA: దేశంలో కరోనా కేసులు నమోదవుతున్న తరుణంలో కడపలో నిర్వహించనున్న మహానాడు వల్ల మరింత విజృంభించే అవకాశాలు ఉన్నాయని వైసీపీ ఆందోళన వ్యక్తం చేసింది. BY: BCN TV NEWS అధికార తెలుగుదేశం పార్టీ పెద్ద పండుగ మహానాడు మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమం ఆ పార్టీకి అత్యంత ప్రతిష్ఠాత్మకం. అంతేకాకుండా టీడీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా కడపలో ఈ భారీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాల్లో ఆయన పార్టీ వైసీపీని ఓడించిన ఏడాదికి నిర్వహిస్తున్న మహానాడును అడ్డుకోవాలని వైసీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ను కలిసి లేఖ సమర్పించింది.
దేశంలో కరోనా కేసులు నమోదవుతున్న తరుణంలో కడపలో నిర్వహించనున్న మహానాడు వల్ల మరింత విజృంభించే అవకాశాలు ఉన్నాయని వైసీపీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే కడప నగరంలో ఓ కేసు నమోదైనందున అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ మాస్కులు ధరించి కలెక్టరేట్ కు వచ్చిన వైసీపీ నేతలు మహానాడు నిర్వహణకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని వినతిపత్రం సమర్పించారు. కడప జిల్లా అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, మాజీ మేయర్ సురేశ్ బాబుతోపాటు పలువురు వైసీపీ నేతలు జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ను కలిశారు.
కడపలో మహానాడు నిర్వహిస్తే కరోనా మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇది కొత్త వేరియంట్ అంటూ కేంద్రం చెబుతుండటం వల్ల మహానాడును వాయిదా వేసుకోవడమే మంచిదని, రాష్ట్ర ప్రజల ఆరోగ్యం దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైసీపీ నేతలు హితవు పలుకుతున్నారు. అయితే వైసీపీ నేతల ప్రయత్నాలపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసులు అంత ప్రమాదకరమని కేంద్ర ప్రభుత్వం చెప్పలేదని గుర్తు చేస్తున్నారు. కడపలో మహానాడు నిర్వహించడాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోందని వ్యాఖ్యానిస్తున్నారు.
కడపలో ఎప్పుడూ లేనట్లు గత ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 10 స్థానాలు ఉండగా, ఏడు చోట్ల టీడీపీ గెలిచింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత పట్టున్న కడప, జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గాల్లోనూ వైసీపీ ఓడిపోయింది. అంతేకాకుండా అంతకుముందు జరిగిన పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గానికి చెందిన రాంభూపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. వైసీపీ అధికారంలో ఉండగా, టీడీపీకి దక్కిన విజయాలు, అనంతరం వైసీపీని కోలుకోని దెబ్బతీయడానికి గుర్తుగా కడపలో మహానాడు నిర్వహించాలని టీడీపీ వ్యూహాత్మకంగా నిర్ణయించుకుంది. 27వ తేదీ మంగళవారం నుంచి 29వ తేదీ గురువారం వరకు మూడు రోజులు పాటు మహానాడు జరగనుంది. చివరి రోజు 5 లక్షల మందితో సభ నిర్వహణకు సిద్ధమవుతున్నవారు. ఈ పరిణామాలు వైసీపీకి టెన్షన్ పెడుతున్నట్లు టీడీపీ చెబుతోంది. దీంతో ఇరుపార్టీల మధ్య రాజకీయం ఆసక్తికరంగా మారింది.