'మహానాడు' మొదటి రోజు హైలెట్స్ ఇవే!


ANDRAPRADESH, KADAPA: తెలుగుదేశం పార్టీ మహానాడు మంగళవారం అంగరంగ వైభవంగా మొదలైంది. పార్టీ చరిత్రలో తొలిసారి కడపలో నిర్వహిస్తున్న మహానాడు ఉదయం 8:30 గంటలకు రిజిస్ట్రేషన్లతో మొదలై సాయంత్రం 6:20 గంటలకు ముగిసింది. ఈ సందర్భంగా.. కడప నగరంలోని ప్రధాన కూడళ్లన్నీ పసుపుమయమయ్యాయి. సభా ప్రాంగణం వద్ద నాయకులు, కార్యకర్తల కోలాహలంతో పండగ వాతావరణం కనిపించింది.


పసుపు పండుగ మంగళవారం ఉదయం కడపలో మొదలైంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కొంతమంది కార్యకర్తలు సైకిళ్లపై వచ్చారు.. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో వాహనాల్లో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో.. కడప ఔటర్ రింగ్ రోడ్డులో ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి. దీంతో పలువురు నేతలు తమ వాహనాలు దిగి, కాలినడకన ప్రాంగణానికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా ప్రసగించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు.. కష్టపడిన కార్యకర్తలకు టీడీపీలో గుర్తింపు లభిస్తుందని.. అందుకు తానే ఉదాహరణ అని అన్నారు. సామాన్య కార్యకర్త అయిన తనకు పార్టీ అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం లభించిందని అన్నారు. ఈ సందర్భంగా.. చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తూ 2029లో టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు అంతా కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా.. "నా తెలుగు కుటుంబం" అనే కాన్సెప్ట్ కింద 6 సూత్రాలను నారా లోకేష్ మహానాడు వేదికపై ప్రకటించారు. వాటిని పార్టీ శాసనాలుగా పేర్కొన్నారు. పార్టీని మరో 40 ఏళ్లు సమర్థంగా నడపాలంటే ప్రజలకు మరింత చేరువ కావాలని.. మారుతున్న ప్రజల అవసరాలకు, ఆలోచనలకు అనుగుణంగా పార్టీలో మార్పులు జరగాలని అన్నారు. టీడీపీ కార్యకర్తలే వెన్నెముక అని నారా లోకేష్ స్పష్టం చేశారు.

తెలుగుజాతి విశ్వఖ్యాతి, యువగళం, స్త్రీశక్తి, పేదల సేవలో సోషల్ రీ ఇంజినీరింగ్, అన్నదాతకు అండగా, కార్యకర్తే అధినేత.. అనే ఆరు అంశాలకు లోబడే పార్టీ పనిచేయాలని తెలిపారు. పార్టీ కార్యకర్తల ఆర్థిక స్వావలంబనకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని ప్రకటించారు.

ఈ సందర్భంగా... మగళవారం రూ.21.53 కోట్ల విరాళాలు అందాయని చంద్రబాబు మహానాడు వేదిక నుంచి చదివారు. దాతలు ఆన్ లైన్ లోనూ విరాళాలు పంపవచ్చని సూచించారు. భవిష్యత్తులో పార్టీని నడపాల్సింది కార్యకర్తలే అని.. శక్తిమేర విరాళమిస్తే పార్టీకి ఖర్చుచేస్తామని.. మిగిలిన సొమ్మును పార్టీ కార్యకర్తల సంక్షేమానికి ఖర్చుచేస్తామని తెలిపారు. విరాళాలను టీడీపీ బ్యాంక్ అకౌంట్ నంబర్ కు పంపాలని కోరారు.

ఇదే సమయంలో.. తొలిరోజు మహానాడు జరిగిన తీరు బాగుందని, విజయవంతమైందని చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం రాత్ర్తి పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన చంద్రబాబు.. తొలిరోజు ప్రసగించిన వక్తలందరికీ ప్రత్యేకంగా విందునిచ్చారు. ఈ సందర్భంగా.. సమయపాలన పాటిస్తూ విషయాన్ని చక్కగా వివరిస్తూ ప్రసంగించారని ఆయన పలువురు నేతలను ప్రశంసించారు.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now