నూతన రైస్ కార్డులకు నమోదు చేసుకోండి.. రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి..


కొత్త కార్డులు, మార్పులు-చేర్పులు, చిరునామా మార్చుకోవచ్చు..
సేవలను సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాల నుండి పొందవచ్చు..


ఏలూరు: నూతన రైస్ కార్డులు జారీతోపాటు మార్పులు, చేర్పులకు సంబంధించి మొత్తం ఆరు రకాల సేవలకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతన రైస్ కార్డులు జారీ, కార్డుల విభజన, చిరునామా మార్పు, సభ్యులను చేర్చడం, ఉన్నవారిని తొలగించడం, కార్డులను సరెండర్ చేయడం మొత్త ఆరు రకాల సేవలను అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు.  

ఇందుకోసం సమీపంలోని గ్రామ,వార్డు సచివాలయాల్లో నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించబడిందన్నారు. అదే విధంగా రైస్ కార్డులో తప్పుడు ఆధార్ నెంబర్ సీడింగ్ ను సరిచేసుకునేందుకు అవకాశం కల్పించబడిందన్నారు. జూన్ మాసంలో స్మార్ట్ కార్డు రూపంలో నూతన రైస్ కార్డుల జారీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నదన్నారు. 2024 ఎన్నికల నేపద్యంలో నూతన కార్డుల జారీని నిలిపివేయవల్సిందిగా భారత ఎన్నికల సంఘం గతఏడాది మార్చిలో ఆదేశాలు జారీ చేసిందని, తదుపరి ఈకెవైసి తప్పనిసరిగా నమోదు చేయాలని సుప్రిం కోర్డు జారీచేసిన ఆదేశాల మేరకు నూతన కార్డుల జారీకి అవకాశం లేకుండా పోయందన్నారు.  

అయితే ఇప్పటివరకు 94.4 శాతం మేర ఈకెవైసి ప్రక్రియ పూర్తయిన నేపద్యంలో నూతన రైస్ కార్డుల జారీకి అవకాశం కల్పించడం జరిగిందన్నారు.  రాష్ట్రంలో మొత్తం 1,46,21,223 రైస్ కార్డులు ఉన్నాయని ఈ కార్డుల ద్వారా దాదాపు 4,24,59,028 మంది తమ పేర్లను నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు మరియు 80 సంవత్సరాలు పైపడిన వారికి ఈకెవైసి చేయాల్సిన అవసరం లేదనే వెలుసుబాటు కల్పించడంతో సుమారు 6,45,765 మందికి ఈకెవైసి చేయడం జరగలేదన్నారు. అదే విధంగా ఇప్పటికే 3.94 లక్షల మంది తమ రైస్ కార్డులో మార్పులు, చేర్పులకోసం నమోదుచేసుకోవడం జరిగిందన్నారు. 

ఈఏడాది జూన్ మాసంలో క్యూఆర్ కోడ్ తో స్మార్ట్ రైస్ కార్డులను జారీచేయడం జరుగుతుందన్నారు. ఆ కార్డులపై కుటుంబ సభ్యుల వివరాలు అన్ని ఉంటాయని ఆ కార్డును స్కాన్ చేయగానే అన్ని వివరాలు కనిపిస్తాయని డేటా బేస్ కు ఈ కార్డును లింక్ చేయడంవల్ల సిస్టంలో ఆటోమేటిక్ గా డేటా కూడా అప్ డేట్ అవ్వడం జరుగుతుందన్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే 6 నెలల రేషన్ వివరాలు తెలుస్తాయన్నారు.  స్మార్ట్ కార్డుతో దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు ఉందన్నారు. 

ఏలూరు జిల్లాలో మొత్తం 6,20,146 రైస్ కార్డులు ఉన్నాయని ఈ కార్డుల ద్వారా దాదాపు 17,31,461 మంది తమ పేర్లను నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 16,15,078 మంది ఈకెవైసి పూర్తయిందన్నారు.  ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు మరియు 80 సంవత్సరాలు పైపడిన వారికి ఈకెవైసి చేయాల్సిన అవసరం లేదనే వెలుసుబాటు కల్పించడంతో సుమారు 25,030 మందికి ఈకెవైసి చేయడం జరగలేదన్నారు.