ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు


ఏలూరు:  ఏలూరులోని ప్రభుత్వ వైద్యకళాశాల విద్యార్థినీ విద్యార్థులకు సౌకర్యవంతమైన వసతి గృహాలు నిర్మించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు అధికారులను ఆదేశించారు.  ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో, ఆయుష్మాన్ భారత్ విభాగం వద్ద, సాంఘిక సంక్షేమ వసతి గృహాల సముదాయాల వద్ద  ప్రభుత్వ వైద్యకళాశాల భవనాల నిర్మాణ పనులను శుక్రవారం  జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు డా. నరసింహం, అసిస్టెంట్ సంచాలకులు వెంకటేష్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), వివిధ శాఖల అధికారులతో కృష్ణబాబు పరిశీలించారు.  


ఈ సందర్భంగా స్పెషల్ సీఎస్ కృష్ణబాబు మాట్లాడుతూ  రానున్న రోజులలో  వైద్య కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, వివిధ వైద్య విభాగాలలో స్పెషలిస్ట్ కోర్స్ లు  750 మంది పైగా విద్యార్థినీ విద్యార్థులు అభ్యసిస్తారని, ఆ సామర్ధ్యానికి తగిన విధంగా ప్రస్తుతం ఉన్న భవనాలకు అదనంగా  హాస్టల్ భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు వెంటనే పంపాలన్నారు.  వసతిగృహ  భవనాలు వైద్యకళాశాలకు దగ్గరలో ఉండేలాగా చూడాలని అధికారులను ఆదేశించారు.  హాస్టల్స్ నిర్మాణానికి అందుబాటులో ఉన్న స్థలం వివరాలను అధికారులు స్పెషల్ సీఎస్ కు వివరించారు.  అనంతరం ఏలూరులోని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఆవరణలో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులను కృష్ణబాబు స్వయంగా పరిశీలించారు. 

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. మాలిని, డిసిహెచ్ఎస్ డా. పాల్ సతీష్, ఏలూరు ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, ఎస్సి కార్పొరేషన్ ఈడి ముక్కంటి,  వైద్యారోగ్య శాఖ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చీఫ్ ఇంజనీర్ కె. శ్రీనివాస్,  ఎస్ఈ  బలరాంరెడ్డి, ఈఈ రాజబాబు, ఏలూరు తహసీల్దార్ శేషగిరిరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.



స్పెషల్ సీఎస్ కృష్ణబాబును కలిసిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య..

ఏలూరు:   ఏలూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందాల్సిందేనని, ఈ విషయంలో ఎటువంటి రాజీ పడే ప్రసక్తే లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు వైద్యాధికారులను ఆదేశించారు.  ఏలూరులో శుక్రవారం ప్రభుత్వ వైద్యకళాశాల భవనాల నిర్మాణ పనులను పరిశీలించేందుకు ఏలూరు విచ్చేసిన స్పెషల్ సీఎస్ కృష్ణబాబు ను ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి) కలిసి ఏలూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో వైద్యులు, వైద్య సిబ్బంది కొరత, వైద్య పరికరాల కొరత కారణంగా పడుతున్న ఇబ్బందులను తెలియజేశారు.  

ఈ సందర్భంగా స్పెషల్ సీఎస్ కృష్ణబాబు మాట్లాడుతూ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్య సమస్యలతో వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యసేవలు ఖచ్చితంగా అందాల్సిందేనన్నారు. అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.  జిల్లా కలెక్టర్ సూచనల మేరకు  ఖాళీగా ఉన్న వైద్యులు, వైద్య సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి ఖాళీలు నింపేందుకు చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ని కృష్ణబాబు ఆదేశించారు.  వైద్య పరికరాలకు సంబంధించి అవసరమైన వైద్య పరికరాలతో ప్రతిపాదనలు పంపాలని, వెంటనే మంజూరు చేస్తామన్నారు. 

ఆపరేషన్ థియేటర్ లో శస్త్ర చికిత్సకు అవసరమైన అత్యవసరంగా కొనుగోలు చేసేందుకు ఆసుపత్రి అభివృద్ధి నిధుల నుండి జిల్లా కలెక్టర్ అనుమతి తో కొనుగోలు చేయాలన్నారు. రేడియోలజిస్ట్ ల కొరత ఉందని, ఇతర ఆసుపత్రులలో పనిచేసే రేడియోలజిస్టులు గంటల ప్రాతిపదికన తాత్కాలికంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏలూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో  ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అధికంగా శస్త్ర చికిత్సలు జరిగేలా వైద్యులు చూడాలన్నారు.     వైద్యులు, వైద్య సిబ్బంది బాధ్యతతో పనిచేయాలని, సిసి కెమెరాల ద్వారా వైద్య సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలని అధికారులను స్పెషల్ సీఎస్. ఆదేశించారు.    

జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి,  రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు డా. నరసింహం, సహాయ సంచాలకులు వెంకటేష్,  జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. మాలిని, డిసిహెచ్ఎస్ డా. పాల్ సతీష్, ఏలూరు ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, ఎస్సి కార్పొరేషన్ ఈడి ముక్కంటి,  వైద్యారోగ్య శాఖ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చీఫ్ ఇంజనీర్ కె. శ్రీనివాస్,  ఎస్ఈ  బలరాంరెడ్డి, ఈఈ రాజబాబు, ఏలూరు తహసీల్దార్ శేషగిరిరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.