VIJAYAWADA, ANDRAPRADESH: భారత్ – పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఏపీలోని విజయవాడలో పాకిస్థాన్ అనే కాలనీ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం ప్రతీకారంతో రగిలిపోయిన భారత్... ఆపరేషన్ సింధూర్ చేపట్టి, పాక్ ఉగ్రవాదులకు ముచ్చేమటలు పట్టించింది. మంగళవారం అర్ధరాత్రిని కాళరాత్రిగా మార్చిన భారత సైన్యం 9 స్థావరాలపై దాడులు చేసి సుమారు 80 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల్లోనూ యుద్ధ సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు.
ఇప్పటికే సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. జమ్మూకశ్మీర్ లోని నియంత్రణ రేఖ వెంబడి భారత్ సైన్యానికి, పాక్ రేంజర్లకు ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఇక సరిహద్దు రాష్ట్రాల్లోనూ అప్రమత్తమైన అధికారులు హై అలర్ట్ జారీ చేశారు. ఈ సమయంలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. ఏపీలో ఓ కాలనీ పాత పేరు తెరపైకి వచ్చింది.
అవును... భారత్ – పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఏపీలోని విజయవాడలో పాకిస్థాన్ అనే కాలనీ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. వాస్తవానికి ఆ దేశానికి ఈ కాలనీకి ప్రస్తుతం ఏమీ సంబంధం లేనప్పటికీ.. నాడు పెట్టుకున్న ఆ పేరు చాలాకాలం ఉండటం ఆ కాలనీవాసులకు నాడు అతిపెద్ద సమస్యగా మారి అనేక ఇబ్బందులు కలిగించిందని అంటున్నారు.
వాస్తవానికి ఈ కాలనీ పేరు ఇప్పుడు పెట్టింది కాదు. సుమారు 45 ఏళ్ల క్రితం 1980 కాలంలో పాకిస్థాన్ నుంచి వచ్చిన శరణార్థులు ఈ ప్రాంతానికి వచ్చి నివాసం ఉంటూ.. ఆ కాలనీకి ఆ పేరు పెట్టుకున్నారు! ఇది విజయవాడ సిటీ కార్పొరేషన్ పరిధిలోని 62వ డివిజన్ పరిధిలో ఉండేది! ఈ కాలనీ పేరు నాడు అక్కడి ప్రజలకు అతిపెద్ద సమస్యగా మారిందట!
ఈ కాలనీ వాసుల ఆధార్, రేషన్, పాన్ కార్డు సహా అన్ని సర్టిఫికెట్లలోనూ చిరునామా... పాకిస్థాన్ కాలనీ, విజయవాడ అనే ఉండేది! అయితే.. నాడు ఈ ప్రాంతానికి వచ్చిన పాక్ శరణార్థులు ఎవరూ తర్వాత కాలంలో లేనప్పటికీ.. కాలనీ పేరు మాత్రం కంటిన్యూ అయ్యింది. అయితే అనంతర కాలంలో కాలనీ వాసులు ఓ నిర్ణయం తీసుకున్నారు.
ఈ కాలనీ పేరు పాకిస్థాన్ అని ఉండటం వల్ల తాము చాలాకాలం ఎదుర్కొన్న ఇబ్బందులకు చరమగీతం పాడాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే కాలనీ వాసులంతా కలిసి తమ కాలనీ పేరు భగీరథ కాలనీగా మార్చుకున్నారు. తాజాగా భారత్ – పాక్ మధ్య ఉద్రిక్త వాతావారణం ఏర్పడిన నేపథ్యంలో మరోసారి ఈ కాలనీ చరిత్ర తెరపైకి వచ్చింది!
కాగా... 1971లో భారత్ – పాక్ మధ్య యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించింది.. ఫలితంగా పాకిస్థాన్ నుంచి తూర్పు పాకిస్థాన్ విడిపోయి ప్రస్తుత బంగ్లాదేశ్ గా అవతరించింది. దీంతో నాడు తూర్పు పాకిస్థాన్ నుంచి లక్షల మంది శరణార్థులు భారత్ కు వచ్చారు. అందులో కొంతమంది బెజవాడకు వచ్చారు!