HYDERABAD:భారతీయ రైల్వే ప్రగతి పథంలో దూసుకుపోతుంది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడానికి కీలక నిర్ణయాలు తీసుకొని, అనేక పథకాలతో ప్రయాణికుల మన్ననలు చూరగొంటుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అమృత భారత స్టేషన్స్ స్కీం కింద అనేక రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
హైదరాబాద్ నగరంలో రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి
ఇక హైదరాబాద్ నగరంలో కూడా ఆరు రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని సంకల్పించిన రైల్వే వీటి అభివృద్ధి కోసం 170. 61 కోట్ల రూపాయలను కేటాయించిన విషయం తెలిసిందే.ఇప్పటికే బేగంపేట రైల్వే స్టేషన్ అత్యాధునికంగా పునరుద్ధరణ జరుపుకొని ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా బేగంపేట రైల్వే స్టేషన్ ను ప్రారంభించారు.
హైదరాబాద్ లో ఐదు రైల్వే స్టేషన్ ల ఆధునీకరణ పనులు
ఇక ఇప్పుడు ప్రస్తుతం హఫీజ్ పేట, హైటెక్ సిటీ, మలక్పేట, మల్కాజ్గిరి, ఉప్పుగూడ రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నారు. ఈ రైల్వే స్టేషన్ లో పునరుద్ధరణ పనులు పూర్తయి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి, ఇప్పటికి దాదాపు 75శాతం నుంచి 80 శాతం పనులు పూర్తి కాగా, ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి పనులు మొత్తం పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.
త్వరలోనే ఈ రైల్వే స్టేషన్ల పనులు పూర్తి
హఫీజ్ పేట, హైటెక్ సిటీ, మలక్పేట స్టేషన్లలో ఇంకా 25 శాతం పనులు పెండింగ్లో ఉన్నాయి. ఈ పనులను మరో 5 నెలల్లో పూర్తి చేసి రైల్వే స్టేషన్లను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. మల్కాజ్గిరి రైల్వేస్టేషన్లో దాదాపు 82 శాతం పనులు పూర్తి కాగా, ప్రస్తుతం ప్లాట్ఫారం నెంబర్ వన్, ప్లాట్ఫారం నెంబర్ టు వైపు షెల్టర్ ల పనులు వేగంగా జరుగుతున్నాయి.
డిసెంబర్ నాటికి అన్ని రైల్వే స్టేషన్ల పనులు పూర్తి
మరో నాలుగు నెలలలో పూర్తి పనులు కంప్లీట్ అవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇక ఉప్పుగూడా రైల్వేస్టేషన్లో 70 శాతం పనులు ఇప్పటికి పూర్తయ్యాయి. మరో అయిదు నెలల్లో పనులు పూర్తి చేయాలని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు.డిసెంబర్ నాటికి అన్ని పనులు పూర్తి చేసే లక్ష్యంతో పని చేస్తున్నారు. ఏది ఏమైనా ఒక హైదరాబాద్ నగరంలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా 2750 కోట్ల రూపాయలతో 40 స్టేషన్లను అభివృద్ధి చేస్తోంది ఇండియన్ రైల్వే.