'అమ్మ చనిపోదాం అంటోంది - మా టిఫిన్ బండికి అనుమతివ్వండి' - కలెక్టర్ వద్దకు 8 ఏళ్ల బాలుడు - SMALL KID COMPLAINT TO COLLECTOR


తనకు వచ్చిన కష్టానికి కలెక్టరేట్ మెట్లు ఎక్కిన 8 ఏళ్ల బాలుడు - జీవనాధారమైన టిఫిన్‌ బండిని నడుపుకునేందుకు అనుమతివ్వాలని విజ్ఞప్తి

ANDRAPRADESH,GUNTUR:చిన్న వయసులో తమకు వచ్చిన కష్టాన్ని చూసి చలించిపోయాడు 8 ఏళ్ల బాలుడు. అధికారులు తమ సమస్యను పట్టించుకోకపోవడంతో విసిగివేసారాడు. దీంతో ఏకంగా కలెక్టరేట్‌ మెట్లు ఎక్కాడు. తమ కుటుంబానికి జీవనాధారమైన టిఫిన్ బండిని నడుపుకునేందుకు అనుమతించాలని వేడుకున్నాడు. తన తల్లి పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని వాపోయాడు. ఈ క్రమంలో అందరం చనిపోదామని అమ్మ అంటోందని అందుకే కలెక్టరేట్‌కు వచ్చానని చెబుతున్నాడు ఆ బాలుడు. తన కుటుంబానికి జీవనాధారమైన టిఫిన్ బండిని పెట్టుకునేందుకు అనుమతించాలని గుంటూరు కలెక్టర్‌ నాగలక్ష్మికి వినతిపత్రం ఇచ్చాడు.

నికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గుంటూరు నగరంలోని వెంకట్రావు పేటకు చెందిన అలవాల రాధిక స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి గేటు వద్ద గతంలో టిఫిన్‌ బండి నడుపుతూ కుటుంబాన్ని పోషించేంది. రోడ్డు విస్తరణ పనుల వల్ల ఇటీవల ఆ బండిని తొలగించారు. దీంతో జీవనోపాధి కోల్పోయామని హాస్పిటల్ బయట పరిసరాల్లో ఎక్కడైనా టిఫిన్‌ బండి పెట్టుకునేందుకు అవకాశం కల్పించాలని రాధిక పలుమార్లు అధికారులకు విన్నవించింది. అయినా ఫలితం లేకపోయింది. దీంతో రాధిక కుమారుడు యశ్వంత్ ఈ విషయమై వినతిపత్రం ఇచ్చేందుకు ఇవాళ కలెక్టరేట్​కు వచ్చాడు.

తమ టిఫిన్ బండిని కాలువలో పడేశారని, జీవనానికి ఇబ్బందిగా ఉందని యశ్వంత్ వాపోయాడు. బండి పెట్టుకోవడానికి అనుమతివ్వాలని కోరినా ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో అమ్మ చనిపోదామని అంటోందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు గుండె సంబంధిత సమస్య ఉందని, టిఫిన్‌ బండి పెట్టుకునేందుకు అనుమతివ్వాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశాడు. దీనిపై వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి వినతి పత్రాన్ని తీసుకొని నగరపాలక సంస్థ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. యశ్వంత్‌ కుటుంబానికి జీవనోపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు. నగర కమిషనర్‌ పులి శ్రీనివాసులు స్పందించి, జీజీహెచ్‌ ఎదుట టిఫిన్‌ బండి పెట్టుకోవడానికి స్థలం చూపించారు. అధికారులకు యశ్వంత్‌ తల్లి రాధిక ధన్యవాదాలు తెలిపారు.

Author

Shakir Babji Shaik

Editor | Amaravathi

WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now