సరోగసి పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్.. 90వేలకు శిశువును కొని 40లక్షలకు అమ్మకం!


HYDERABAD:యూనివర్సల్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డిసిపి రష్మీ పెరుమాళ్ ఈ కేసులో అనేక కీలక విషయాలను వెల్లడించారు. అక్రమ సరోగసి ద్వారా చైల్డ్ ట్రాఫికింగ్ జరిగినట్టు పేర్కొన్నారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ లో అక్రమ సరోగసి చేసినట్టు తెలిపిన నార్త్ జోన్ డిసిపి రష్మీ పెరుమాళ్ ఈ కేసులో పిల్లల అమ్మకాల రాకెట్ ను చేదించినట్టు తెలిపారు.

సరోగసి పేరుతో ఫెర్టిలిటీ సెంటర్ మోసం

ఈ కేసు వివరాలను వెల్లడించిన నార్త్ జోన్ డిసిపి 2024 ఆగస్టులో సంతానం కోసం ఒక జంట యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ను ఆశ్రయించారని, డాక్టర్ నమ్రత వారికి సరోగసి చేయించుకోవాలని సూచించారని తెలిపారు. సరోగసి ద్వారా పిల్లలను కనడానికి తమ క్లినిక్ సహాయం చేస్తుందని చెప్పగా, దీనికోసం దంపతులు 9నెలలపాటు క్లినిక్ డబ్బులు చెల్లించారు. సరోగసి ద్వారా జూన్ 2025లో విశాఖపట్నంలో ఒక మగ శిశువు జన్మించాడు.

పిల్లలు లేని జంట నుండి 35 లక్షలు వసూలు చేసిన ఫెర్టిలిటీ సెంటర్

డెలివరీ చార్జీలు చెల్లించి బిడ్డను తీసుకువెళ్లాలని ఆ దంపతులకు డాక్టర్ నమ్రత సూచించారు. వారికి బిడ్డను అప్పగించి, తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాన్ని, డిఎన్ఏ నివేదికను కూడా వారికి అందించారు. సంతానం లేని భార్యాభర్తల అండం, వీర్యం ద్వారానే బిడ్డ పుట్టినట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. ఈ ప్రక్రియలో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఆ జంట నుండి 35 లక్షలకు పైగా వసూలు చేసింది.

డీఎన్ఏ సరిపోలక కేసు పెట్టిన దంపతులు

ఆ తర్వాత బిడ్డ డిఎన్ఏ ను వారు పరీక్షించగా, వారి డిఎన్ఏ తో సరిపోలేదు. దీంతో మోసపోయినట్టు గుర్తించిన ఆ జంట పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసి, డాక్టర్ నమ్రతను అరెస్టు చేసి విచారణ చేపట్టగా ఆ ఫెర్టిలిటీ సెంటర్ లో జరుగుతున్న మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి.

సరోగసి పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్

డాక్టర్ నమ్రత సరోగసి ద్వారా పిల్లలను పుట్టిస్తానని చెప్పి ప్రతి క్లైంట్ నుండి 20నుండి 30లక్షల రూపాయల వరకు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. ఈ జంటకు 90వేల రూపాయలిచ్చి కొనుగోలు చేసిన శిశువును 40లక్షలకు విక్రయించినట్టు తెలిపారు. సరోగసి ద్వారా బిడ్డలను పుట్టిస్తున్నానని చెప్పి చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్నారని డిసిపి రష్మీ వెల్లడించారు. లైసెన్సు లేకుండానే ivf చికిత్సలు చేస్తున్నట్టు గుర్తించామని పేర్కొన్నారు.

8మంది ముఖ్య నిందితులు అరెస్ట్

చిన్న పిల్లలను కొనుగోలు చేసి, సరోగసి ద్వారా పుట్టిన బిడ్డలని నమ్మిస్తూ డాక్టర్ నమ్రత మోసం చేస్తుందని పేర్కొన్నారు. గతంలో డాక్టర్ నమ్రతా పై విశాఖపట్నం టూ టౌన్ పిఎస్, మహారాణిపేట పిఎస్, గోపాలపురం పిఎస్, గుంటూరులోని కొత్తపేట పిఎస్ లలో కేసులు నమోదయ్యాయని గుర్తించారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ రిజిస్ట్రేషన్ ను రద్దు చేసినట్టుగా తెలిపారు. అయినప్పటికీ నమ్రత మరో సర్టిఫైడ్ డాక్టర్ సూరి పేరును ఉపయోగించి ఈ దందా నిర్వహిస్తున్నట్లుగా డిసిపి రష్మీ పెరుమాళ్ వెల్లడించారు. ఈ కేసులో 8 మంది ముఖ్య నిందితులను అరెస్ట్ చేసినట్టుగా తెలిపారు.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now