ANDHRAPRADESH:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం దూసుకుపోతుంది. ఈ మేరకు అందులో భాగంగానే ఇప్పుడు మరో విశిష్టమైన ముందడుగు వేసింది. ఐదేళ్ల గడువు ఉన్న నూతన అంతరిక్ష విధానాన్ని (AP Space Policy) అధికారికంగా ప్రకటించింది.
అంతరిక్ష పరిశోధన, తయారీ, ప్రైవేట్ లాంచ్ ప్యాడ్లు, ఉపగ్రహ నిర్మాణం వంటి రంగాల్లో దేశంలో ముందున్న రాష్ట్రాల సరసన నిలబెట్టేందుకు ఈ విధానం తీసుకొస్తున్నట్టు వెల్లడించింది. ఈ పాలసీ ద్వారా నూతన అవకాశాలను అందించడంతో పాటు పెట్టుబడులను, పరిశోధన ప్రాజెక్టులను ఆకర్షించాలని ప్రభుత్వం ఆశిస్తుంది. ఈ స్పేస్ పాలసీ అమలుకు ప్రత్యేకంగా "ఆంధ్రప్రదేశ్ స్పేస్ సిటీ కార్పొరేషన్" అనే సంస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా స్పేస్ టెక్నాలజీ రంగంలో పరిశోధన, అభివృద్ధి, వినియోగం, తయారీకి అనువైన వాతావరణాన్ని అందించడానికి ఈ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించనుంది.
ఈ కార్పొరేషన్ ద్వారా సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో రెండు భారీ స్పేస్ సిటీలు నిర్మించనున్నారు. ఈ స్పేస్ సిటీలలో రాకెట్ లాంచ్ ప్యాడ్లు, ఉపగ్రహ తయారీ కేంద్రాలు, డేటా అనాలిటిక్స్ ల్యాబ్స్, ప్రయోగాత్మక పరిశోధనా కేంద్రాలు, ప్రైవేట్ స్పేస్ కంపెనీలకు లాబ్ స్పేస్‌లు, ట్రైనింగ్ హబ్‌లు వంటి మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దనున్నారు. భూ కేటాయింపులు, పరిశ్రమల అనుమతులు, ప్రాజెక్ట్ స్కానింగ్ వంటి అంశాలన్నీ ప్రత్యేక కమిటీ పర్యవేక్షణలోనే జరగనున్నాయి.
ఈ విధానంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ స్పేస్ కంపెనీలకు అధిక ప్రాధాన్యతనిస్తుంది. వాటికి అవసరమైన సబ్సిడీలు, ప్రోత్సాహకాలతో పాటు లైసెన్సింగ్, అనుమతుల సౌలభ్యం కల్పించేలా ప్రత్యేక పారిశ్రామిక విధానం తీసుకురాబోతుంది. అంతర్జాతీయ స్థాయి పరిశోధనా సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వానికి భాగస్వామ్యాలు ఏర్పడేలా చర్యలు చేపట్టనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అంతే కాకుండా విద్యార్థులకు, పరిశోధకులకు.. అంతరిక్ష రంగంలో నైపుణ్యాలను మెరుగు పరచడానికి ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే రాష్ట్రంలోని అగ్ర విశ్వవిద్యాలయాలతో కలిసి కొత్త స్పేస్ కోర్సులు, ఇంటర్న్‌షిప్ కార్యక్రమాలు ప్రారంభించనున్నారు.
ఈ విధానం ద్వారా రాష్ట్రంలో నూతన ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. స్టార్టప్‌లకు పెట్టుబడులు అందనున్నాయి. దేశీయ/అంతర్జాతీయ భాగస్వామ్యాలతో ముందడుగు పడనుందని అంటున్నారు. మొత్తానికి, ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ రాష్ట్రాన్ని భవిష్యత్ టెక్నాలజీ కేంద్రంగా మార్చే దిశగా ఎంతో కీలకంగా మారనుంది.

Shakir Babji Shaik
Editor | Amaravathi