ఆయన లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు

HYDERABAD:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ రాజకీయాల్లో చోటు చేసుకుంటోన్న మార్పులు, విపరీత ధోరణిపై ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాలకు ఇలాంటి రాజకీయాలు ఏ మాత్రం మంచివి కావని ఆయన అభిప్రాయపడ్డారు.

శనివారం హైదరాబాద్‌ లో క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ, ఇక్ఫాయ్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్ స్వర్గీయ ఎస్ జైపాల్ రెడ్డి డెమాక్రసీ అవార్డును ప్రముఖ రచయిత మోహన్ గురుస్వామికి అందించారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. ధన ప్రభావం విపరీతంగా పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామిక స్ఫూర్తికి ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతున్నాయని అన్నారు. ధన ప్రభావం తగ్గి విలువలతో కూడిన సిద్ధాంతపరమైన రాజకీయాలు ఉండాలని చెప్పారు.

సిద్ధాంతపరమైన రాజకీయాలు కాకుండా ఎవరెంత వేగంగా డెలివరీ చేస్తారన్న 'స్విగ్గీ పాలిటిక్స్' తెరమీదకొచ్చాయని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకర పరిణామమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యూనివర్సిటీల్లో సిద్ధాంతపరమైన విద్యార్థి రాజకీయాలు రావలసిన అవసరం ఉందని అన్నారు.

జైపాల్ రెడ్డి విద్యార్థి నాయకుడిగా, శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా... వివిధ హోదాల్లో ప్రాతినిధ్యం వహించి సుదీర్ఘంగా సిద్ధాంతపరమైన రాజకీయాలు చేశారని గుర్తు చేశారు. 1984లో పార్లమెంట్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి 35 ఏళ్లు వెనుదిరిగి చూడకుండా దేశ రాజకీయాల్లో రాణించారని, దీనికి కారణం.. విలువలు, సిద్ధాంతాలే కారణమని పేర్కొన్నారు.

1969 లో రాజకీయాల్లో అడుగుపెట్టి 50 సంవత్సరాల పాటు అంటే 2019 చివరి శ్వాస వరకు ప్రజల పక్షాన, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారని రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ నుంచి దేశ రాజకీయాల్లో జైపాల్ రెడ్డి బలమైన ముద్ర వేశారని, ఆయనకు రాజకీయ ప్రత్యర్థులే గానీ శత్రువులు ఎవరూ లేరని అన్నారు.

సిద్ధాంతపరమైన రాజకీయాలే తప్ప వారు ఏనాడూ పదవులను ఆశించలేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ నుంచి గొప్పగా రాణించిన పీవీ నరసింహారావు తర్వాత జైపాల్ రెడ్డి చట్ట సభల్లో ఈ ప్రాంతానికి గుర్తింపు తెచ్చారని చెప్పారు.

తెలంగాణ ఏర్పాటులో జైపాల్ రెడ్డి పాత్ర విస్మరించలేనిదని, ఆయన లేకపోతే తెలంగాణ వచ్చి ఉండేది కాదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన సమయస్ఫూర్తి, అనుభవంతో ఉభయ సభల్లో బిల్లును ఆమోదింప జేయడంలో అత్యంత కీలక పాత్ర పోషించారని, రాజ్యసభలో సవరణలు ప్రతిపాదించినప్పుడు గాని, కేంద్ర కేబినేట్‌లో గాని జైపాల్ రెడ్డి గారు చూపించిన చొరవ మరువలేనిదని చెప్పారు.

సిద్ధాంతపరమైన రాజకీయాలను నమ్మేవారు, పాటించేవారు, సిద్ధాంతాల కోసమే పనిచేసే వాళ్లు దేశ రాజకీయాల్లో తగ్గుతూ వస్తున్నారని, ఇది దేశానికి, ప్రజాస్వామిక స్పూర్తికి ప్రమాదకరమని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దేశం వేగంగా ప్రమాదం వైపు ప్రయాణిస్తోందని, ప్రజాస్వామిక విలువలు తగ్గి పొలిటికల్ మేనేజ్‌మెంట్లు, పొలిటికల్ మేనేజర్స్ ఎక్కువయ్యారని అన్నారు.

కార్యకర్తలు పోయి వాలంటీర్స్ వచ్చారని, కార్యకర్తలు లేని రాజకీయాలు దేశ భవిష్యత్తుకు ప్రమాదకరమని పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో ధన ప్రభావం తగ్గాల్సిన అవసరం ఉందని, వ్యక్తిగత రాజకీయాలకంటే సిద్ధాంతపరమైన భిన్నాభిప్రాయాలు ఉండే రాజకీయాలు ప్రజాస్వామిక విలువలను కాపాడుతాయని అన్నారు.

 

WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now