ANDHRAPRADESH:ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై గత ఎన్నికలకు ముందు విజయవాడలో గులకరాయి విసిరిన కేసులో నిందితుడిగా ఉన్న వేముల సతీష్ తాజాగా అదృశ్యమయ్యాడు. ఉన్నట్లుండి విజయవాడలోని తన ఇంటి నుంచి అతను అదృశ్యం కావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ నేపథ్యంలో అతని తల్లితండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు ప్రారంభించారు.
జగన్‌పై గతంలో గులకరాయితో దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్న సతీష్ ఈ నెల 18న ఇంటి నుంచి పారిపోయాడు. అతని ఆచూకీ కనిపించడకపోవడంలో తీవ్రంగా గాలించిన కుటుంబసభ్యులు చివరికి ఈ నెల 20న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పోలీసులు గాలింపు చేపట్టారు. చివరికి పోలీసులు సతీష్ ను కడపలో గుర్తించారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విజయవాడకు తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
అయితే సతీష్ ఇలా ఎందుకు ఉన్నట్లుండి పారిపోయాడన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో అతను ప్రేమ వ్యవహారం కారణంగా పారిపోయినట్లు అనుమానించారు కూడా. చివరికి ఇంట్లో తల్లితండ్రులు మందలించడం వల్లే ఇలా విజయవాడ నుంచి కడపకు సతీష్ పారిపోయినట్లు గుర్తించారు. గతంలో అతనికి లాయర్ గా ఉన్న సలీమ్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. దీంతో పోలీసులు తల్లితండ్రులకు సతీష్ ను ఇవాళ అప్పగించారు. దీంతో కథ సుఖాంతమైనట్లయింది.