తెలంగాణాలో జోరువానలు.. నేడు ఈ జిల్లాలకు వర్ష హెచ్చరిక!


HYDERABAD:తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముసురు పట్టినట్టు వర్షం కురుస్తుండడంతో ప్రజలు కాస్త ఇబ్బంది పడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం బలమైన అల్పపీడనంగా మారి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతోంది. అయితే అక్కడినుండి అది రాజస్థాన్ వైపు వెళ్ళి తెలుగు రాష్ట్రాలపై క్రమంగా తగ్గిపోతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

ఏపీ, తెలంగాణాలలో వర్షాలు

అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటడం, ఇప్పటికే ఉన్న ద్రోణి, చల్లని వాతావరణం వల్ల మనకు వర్షాలు పడతాయని వెల్లడించింది. భారత వాతావరణ శాఖ తాజా ప్రకటించిన బులిటెన్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో చాలా ప్రాంతాలలో మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దక్షిణ భారతదేశంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది.

నేడు మోస్తరు నుండి భారీ వర్షాలు

ఇక శాటిలైట్ అంచనాల ప్రకారం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలకు అవకాశం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ముసురు వర్షాలు పడతాయని అంచనా వేస్తోంది. అయితే కొన్ని జిల్లాలలో మాత్రం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటడం వల్ల రాష్ట్రంలో పలుచోట్ల నేడు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది.

నేడు వర్షాలు పడే జిల్లాలు ఇవే

ఈ రోజు రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన అవకాశం ఉందని పేర్కొంది.

అన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్

అలాగే రాష్ట్రంలోని అన్ని మిగతా జిల్లాలలో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది .ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదులలో కూడా నీటి ఉధృతి పెరిగింది.

ఈ వర్షాలతో రైతులకు ఊరట.. కానీ జాగ్రత్త

ఇక గత కొంతకాలంగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాలు కాస్త ఊరట కలిగిస్తున్నాయని చెప్పొచ్చు. అయితే భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షం పడుతున్న సమయంలో రోడ్లపైన వాహనాలను జాగ్రత్తగా నడపాలని , వర్షం పడుతున్న సమయంలో పొలాల్లోకి వెళ్ళిన రైతులు చెట్ల కిందకు వెళ్ళొద్దని పిడుగుపాటుకు గురయ్యే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.


WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now