INDIAN:పాకిస్థాన్ నుంచి బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షా సగౌరవంగా స్వదేశానికి తిరిగి రావడం భారత దౌత్య బలానికి, మన సాయుధ దళాల ధైర్యానికి నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. ఈ సంఘటన ద్వారా అంతర్జాతీయ స్థాయిలో భారత దౌత్యం ఎంత పటిష్టంగా ఉందో స్పష్టమైందని ఆయన అన్నారు. లోక్‌సభ సమావేశాల సందర్భంగా ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.
సరిహద్దు దాటిన జవాన్.. దౌత్య విజయం
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజు ఏప్రిల్ 23న, జవాన్ పూర్ణం కుమార్ షా అనుకోకుండా సరిహద్దు దాటి పాకిస్తాన్‌లోకి వెళ్లాడు. వెంటనే అతన్ని పాకిస్తాన్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. ఆన్‌లైన్‌లో పూర్ణం కుమార్ షాకు కళ్లకు గంతలు కట్టిన చిత్రాలు విడుదల కావడంతో, దేశవ్యాప్తంగా ప్రజలలో తీవ్ర ఆందోళన, ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే డీజీఎంవో(డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్) స్థాయిలో నిరంతరంగా జరిగిన దౌత్యపరమైన చర్చల ఫలితంగా పూర్ణం కుమార్ షా పట్టుబడిన 20 రోజుల తర్వాత, మే 14న అత్తారీ-వాఘా బార్డర్ ద్వారా సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఇది భారత ప్రభుత్వ నిరంతర కృషికి నిదర్శనమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
పాక్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టిన ప్రధాని
ఈ సంఘటనను దుష్ప్రచారం కోసం పాకిస్తాన్ దుర్వినియోగం చేయడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, మన జవాన్ పూర్తి సగౌరవంగా తిరిగి వచ్చాడని ప్రధానమంత్రి మోదీ లోక్‌సభలో స్పష్టం చేశారు.భారత దృఢమైన దౌత్య విధానం, మన భద్రతా దళాల ధైర్యం వల్లే సైనికుడికి తిరిగి గౌరవంగా రావడం సాధ్యమైందని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ ప్రయత్నాలు విఫలమయ్యాయని ఈ సంఘటన రుజువు చేసిందని ప్రధాని పేర్కొన్నారు.
బలమైన రక్షణ
పంజాబ్‌లోని ఆదంపూర్ ఎయిర్ బేస్ గురించి పాకిస్తాన్ ఇటీవల తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడంపై కూడా ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. పాకిస్తాన్ ఆ స్థావరం గురించి తప్పుడు కథనాలను సృష్టించడానికి ప్రయత్నించిందని ఆయన వెల్లడించారు. "ఈ మోసాన్ని ఎదుర్కోవడానికి నేను మరుసటి రోజు, మే 13న ఆదంపూర్‌ను సందర్శించాను. మన సైనికుల మనోబలాన్ని పెంచడానికి, ఆ అబద్ధాలను ప్రపంచానికి బహిర్గతం చేయడానికి ఈ సందర్శన చేశాను" అని మోదీ వివరించారు. భారత్ తన సరిహద్దులను రక్షించడానికి, ఏదైనా శత్రు చర్యలకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడటానికి తన అచంచలమైన నిబద్ధతను మరోసారి పునరుద్ఘాటించారు. మన పెరుగుతున్న రక్షణ సామర్థ్యాలు. మన దళాల ఐక్యత మన గొప్ప బలమని ఆయన అన్నారు, దేశ భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ప్రధాని మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు శత్రువులకు ప్రత్యక్ష సందేశం పంపినట్లయ్యాయి. అదే సమయంలో జాతీయ భద్రతను కాపాడటంలో ప్రభుత్వం చురుకైన, ముందుచూపుతో కూడిన విధానం గురించి దేశ ప్రజలకు పూర్తి భరోసాను కల్పించినట్లయ్యింది.