ANDHRPRADESH:ఏపీలో లులు గ్రూపుకు ప్రభుత్వం చేసిన భూ కేటాయింపుల వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఈ కేటాయింపుల పైన హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. విశాఖపట్నం, విజయవాడలో లూలూ గ్రూపునకు భూములు కేటాయింపుపై సమగ్ర విచారణ చేస్తామని హైకోర్టు ప్రకటించింది. రెండు జిఓలను పిటిషనర్ సవాల్ చేయాలని చెప్పింది. ఆ తర్వాత విచారణ చేస్తామని చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన డివిజన్ బెంచ్ ప్రకటించింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
విశాఖలో 13.74 ఎకరాల భూమిని ఎలాంటి బిడ్లు లేకుండా లూలూ గ్రూపునకు కేటాయిస్తూ ఇచ్చిన జిఓ 45ను రద్దు చేయాలని విశాఖ న్యాయవాది పాకా సత్యనారాయణ హైకోర్టులో పిల్ దాఖలు చేసారు. విజయవాడలో కూడా లూలూకు భూమి ఇవ్వడానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని న్యాయవాది చెప్పారు. విశాఖలో కేటాయించిన భూమి మార్కెట్ విలువ రూ.50 కోట్లు ఉంటుందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ, విజయవాడలో లూలూ గ్రూపునకు భూ కేటాయింపులకు సంబంధించిన జిఓను కూడా సవాల్ చేయాలని పిటిషనర్‌కు చెప్పింది. విశాఖ పట్నంతో పాటు విజయవాడలో లూలూ గ్రూపునకు భూమిని కేటాయిస్తూ జారీ చేసిన జీవోను కూడా సవాల్ చేయాలని పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత పిల్‌పై పూర్తిస్థాయి విచారణ జరుపుతామని పేర్కొంది.
విశాఖ నగరంలో షాపింగ్ మాల్ ఏర్పాటుకు సంబంధించి 13.5 ఎకరాలను తక్కువ ధరకు రాష్ట్ర ప్రభుత్వం లులు సంస్థకు కేటాయించబోతుందని పిటీషన్ లో పేర్కొన్నారు. లులు సంస్థకు 2018లో బిడ్డింగ్ ద్వారా భూమి కేటాయించారని తెలిపారు. 2019 నవంబరు 8న అప్పటి వైసీపీ ప్రభుత్వం భూ కేటాయింపులను రద్దు చేసిందని పేర్కొన్నారు. బిడ్లు ఆహ్వానించకుండా, సంస్థ చైర్మన్ ప్రతిపాదనల మేరకు సీఆర్‌జెడ్ నిబంధనలను ఉల్లంఘించి ఆ సంస్థకు తిరిగి భూమిని కేటాయించారని వివరించారు. విజయవాడలో కూడా లులు సంస్థకు భూమి కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.... విజయవాడలో లులు గ్రూపుకు భూమిని కేటాయిస్తూ జారీ చేసిన జీవోను కూడా సవాల్ చేయాలని పిటిషనర్‌కు సూచిస్తూ.. విచారణ వాయిదా వేసింది.
