HYDERABAD:తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లోని బంజారాహిల్స్ లోని పెద్దమ్మ గుడిని కూల్చివేయడం పైన హిందూ సంఘాల నుండి ఆగ్రహ జ్వాలలు మిన్ను ముడుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ జరుగుతున్న సమయంలో బంజారాహిల్స్ లోని పెద్దమ్మ గుడిని కూల్చివేయడం పైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బిజెపి సీనియర్ నాయకులు బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన పైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు .
రోడ్డుకు అడ్డంగా అనేక చర్చిలు, మసీదులు.. గుడినే ఎందుకు కూల్చారు: బండి సంజయ్
ఈ ఘటనను ఆయన ఒక దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయకుట్రలో భాగంగానే ఈ చర్యకు పాల్పడిందని బండి సంజయ్ ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఒక ప్రత్యేకవర్గం ఓట్లను పొందేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ చర్యకు పాల్పడిందని బండి సంజయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్డుకు అడ్డంగా అనేక చర్చిలు, మసీదులు ఉన్నప్పటికీ గుడిని మాత్రమే ఎందుకు లక్ష్యం చేసుకున్నారో చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో రాజకీయ లబ్ధికి కుట్ర
ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్ బోనాల పండుగ సమయంలో పెద్దమ్మ గుడి ని కూల్చడం హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్య అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలలో 80 శాతం ఉన్న హిందువులందరూ ఏకమై దీనికి తగిన సమాధానం చెబుతారని ఆయన స్పష్టం చేశారు. ఈ కూల్చివేత వెనుక రాజకీయ లబ్ధి కోసం ఓ వర్గం ఓటర్లను ఆకర్షించే కుట్ర ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.
సీఎం రమేష్ తో చర్చకు కేటీఆర్ వస్తారా?
తక్షణమే పెద్దమ్మ గుడి కూల్చివేత బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో హిందువుల దమ్మేంటో చూపిస్తామని ఆయన అన్నారు. ఇదే సమయంలో బిజెపిలో బీఆర్ఎస్ చేరిక పైన సీఎం రమేష్ చెప్పింది నిజమేనని కేటీఆర్ కు దీనిపై చర్చకు వచ్చే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. సీఎం రమేష్ ను రప్పించి వేదిక ఏర్పాటు చేయిస్తానని కేటీఆర్ కు సవాల్ విసురుతున్నానన్నారు.
బిసి డిక్లరేషన్ ముమ్మాటికీ ముస్లిం డిక్లరేషన్
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో తీసుకున్న నిర్ణయాల పైన బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిసి డిక్లరేషన్ ముమ్మాటికీ ముస్లిం డిక్లరేషన్ అని, బీసీ ముసుగులో ముస్లింలకు వంద శాతం రిజర్వేషన్లను అమలు చేసే కుట్ర జరుగుతుందని బండి సంజయ్ అన్నారు. బీసీలకు కేవలం ఐదు శాతం అదనపు రిజర్వేషన్ మాత్రమే వస్తుందని పేర్కొన్నారు.
ముస్లిం రిజర్వేషన్లను బీసీ జాబితా నుంచి తొలగించే దాకా ఉద్యమిస్తాం
మిగిలిన 10 శాతం ముస్లింలకు కేటాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో హిందువులను, మైనారిటీలను చేసే కుట్ర జరుగుతోందన్నారు. ఈ విష వృక్షాన్ని అడ్డుకోకపోతే దేశమంతా విస్తరించే ప్రమాదం ఉందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తేనే మద్దతిస్తామని అన్నారు. ముస్లిం రిజర్వేషన్లను బీసీ జాబితా నుంచి తొలగించే దాకా ఉద్యమిస్తామని బండి సంజయ్ అన్నారు.