ANDHRAPRADESH:గతంలో లాగే తిరుమలలో మరోసారి చిరుతల సంచారం మళ్లీ ఆరంభమైనట్టే కనిపిస్తోంది. తాజాగా అలిపిరి వద్ద చిరుత సంచరించింది. ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తోన్న వాహనదారులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. సమాచారం అందుకున్న వెంటనే తిరుమల తిరుపతి అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. భద్రత చర్యలు చేపట్టారు.
కొద్ది రోజులుగా తిరుపతి- తిరుమల మెట్ల మార్గంలో చిరుత కనిపించడం పరిపాటిగా మారింది. ఇదివరకు అలిపిరి నడక దారిలో చిరుత సంచరించిన విషయం తెలిసిందే. 350వ మెట్టు సమీపంలో భక్తులు చిరుతను గుర్తించారు. భయంతో భక్తులు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అప్పట్లో.
ఇప్పుడు తాజాగా మళ్లీ చిరుత కనిపించడం కలకలం రేపింది. వాహనదారులు, శ్రీవారి భక్తుల్లో భయాందోళనలను నింపింది. శుక్రవారం రాత్రి అలిపిరి- శ్రీవేంకటేశ్వర జూ పార్క్ మార్గంలో చిరుతను గుర్తించారు కొందరు వాహనదారులు. బైక్ పై వెళ్తోన్న వారిపై అది దాడి చేయడానికీ ప్రయత్నించింది.
దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రోడ్డు పక్కన పొదల్లో నుంచి ఒక్క ఉదుటన చిరుత బయటికి రావడం.. రోడ్డు మీద వెళ్తోన్న బైక్ పై దూకడం ఈ వీడియోలో స్పష్టంగా రికార్డయింది. బైక్ వేగానికి అది అదుపు తప్పి కిందపడి, వెంటనే సమీప అటవీ ప్రాంతంలోకి పారిపోవడం చూడొచ్చు. ఆ బైక్ వెనుకే వెళ్తోన్న ఓ కారు డ్యాష్ క్యామ్ లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.
వెంటనే టీటీడీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది.. భద్రత చర్యలు చేపట్టారు. సైరన్ మోగిస్తూ చిరుతను తరిమేందుకు ప్రయత్నాలు చేశారు. అలిపిరి- ఎస్వీ జూపార్క్ మార్గంలో రాకపోకలు సాగించే భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
శేషాచలం అడవుల్లో చిరుతలు, ఎలుగుబంట్లు, ఇతర వణ్య ప్రాణుల సంఖ్య భారీగా పెరుగుతోందనడానికి తాజా ఉదంతం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గత ఏడాది చిరుతల సంచారం శ్రీవారి భక్తులను భయాందోళనలకు గురి చేసిన విషయం తెలిసిందే. అలిపిరి, శ్రీవారిమెట్లు, గాలి గోపురం పరిసర ప్రాంతాల్లో చిరుతలు కనిపించాయి అప్పట్లో.
వాటిని కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించడానికి సుమారు 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలిపిరి నుంచి గాలిగోపురం, శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, 38వ మలుపు, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం క్యాంపస్ సహా మొత్తం ఏడు చోట్ల చిరుతల సంచారాన్ని గుర్తించారు.
ఇప్పుడు మరోసారి చిరుతల బెడద మొదలైంది. దీన్ని నివారించడంపై టీటీడీ ఇప్పటికే దృష్టి సారించింది. అలిపిరి మార్గాన్ని చిరుత రహిత ప్రాంతంగా మార్చడానికి కెమెరా ట్రాప్స్, స్మార్ట్ స్టిక్స్, బయో ఫెన్సింగులు, నెట్ గన్స్, హై ఫ్లాష్ టార్చ్ లైట్లు, పెప్పర్ స్ప్రేలు.. తదితర వస్తువులను రక్షణ పరికరాల వినియోగించేలా నిర్ణయం తీసుకుంది.

Shakir Babji Shaik
Editor | Amaravathi