జగన్‌కు వరుస షాకులు.. సొంత నియోజకవర్గంలో ఎదురుదెబ్బ


వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్‌కు సొంత నియోజకవర్గ ప్రజలు మరో షాకిచ్చారు. తాజాగా ఇవాళ రెండు వందల మైనారిటీ కుటుంబాలు వైసీపీకి తిలోదకాలిచ్చి టీడీపీ కండువా కప్పుకున్నారు.


పులివెందుల (కడప జిల్లా) నవంబర్ 30: వైసీపీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్‌కు సొంత ఇలాకాలో మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలుమార్లు పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వేంపల్లి మండల కేంద్రానికి చెందిన 200 మైనారిటీ కుటుంబాలు ఇవాళ (ఆదివారం) టీడీపీలో చేరాయి.

పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి సమక్షంలో ఈ చేరికల కార్యక్రమం ఘనంగా జరిగింది. కొత్తగా చేరిన వారికి బీటెక్ రవి స్వయంగా టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీటెక్ రవి మాట్లాడుతూ.. 'వేంపల్లి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. గతంలో రిగ్గింగ్‌కు పాల్పడిన సతీష్ రెడ్డి కుటుంబాన్ని ధైర్యంగా అడ్డుకున్న చరిత్ర టీడీపీ కార్యకర్తలదే. ప్రజాస్వామ్యం గురించి సతీష్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదం' అని విమర్శించారు.

అలాగే 'మా కార్యకర్తలను సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు చేసే వరకు విశ్రమించబోను. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే మా ఏకైక లక్ష్యం' అని బీటెక్ రవి స్పష్టం చేశారు. ఈ చేరికలతో పులివెందులలో టీడీపీ బలం మరింత పెరిగింది.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now