పార్లమెంటు డ్రామాల వేదిక కాదు… విధాన చర్చల కోసమేనని మోదీ తీవ్ర వ్యాఖ్యలు


INDIA, న్యూఢిల్లీ, డిసెంబరు 1: పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాటకాలు వేయడానికి పార్లమెంటు వేదిక కాదని, ఇది ప్రజలకు సేవ చేయడానికి, నిర్మాణాత్మక చర్చలు సాగించడానికి ఉద్దేశించిన ప్రదేశమని స్పష్టంచేశారు. చట్టసభలను రాజకీయ డ్రామాలకు మలచడం సరైంది కాదని ఆయన విమర్శించారు.


ఏర్పాటు చేసిన వేదికను ఎన్నికల రాజకీయాలకు వాడుకోవడం, ఓటముల అసహనాన్ని చట్టసభలపై వెదజల్లడం తగదని మోదీ పేర్కొన్నారు. నినాదాలు బయట చేసుకోవచ్చేమోగానీ, పార్లమెంటులో మాత్రం విధానాలపై మాత్రమే దృష్టి పెట్టాలని ప్రతిపక్షాలకు హితవు పలికారు. ‘‘అవసరమైన చోట నిర్మాణాత్మక విమర్శలు చేయండి కానీ పార్లమెంటును పోరాట వేదికగా మార్చవద్దు’’ అని ఆయన అన్నారు.

ప్రధాని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది. మోదీ ప్రసంగమే పెద్ద డ్రామా అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ప్రజల సమస్యలను లేవనెత్తడం డ్రామా కాదని, చర్చకు అవకాశం ఇవ్వకపోవడమే అసలు డ్రామా అని కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ మండిపడ్డారు. సర్‌ నిర్వహణ, ఢిల్లీ పేలుళ్లపై చర్చకు అనుమతించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో ఇరు సభల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.

లోక్‌సభలో నినాదాలతో హోరెత్తిన విపక్షాలను అదుపు చేయలేక స్పీకర్‌ ఓం బిర్లా మధ్యాహ్నం 2 గంటలకు సభను వాయిదా వేశారు. అనంతరం సమావేశం జరిగినప్పటికీ పరిస్థితి మారకపోవడంతో గందరగోళం మధ్యనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పలు బిల్లులను ప్రవేశపెట్టారు. పాన్‌మసాలా, పొగాకు ఉత్పత్తులపై సుంకాలు పెంచే ఎక్సైజ్‌ సవరణ బిల్లు, ఆరోగ్య భద్రత, జాతీయ భద్రతాసెస్‌ బిల్లులతో పాటు మణిపూర్‌ జీఎస్టీ సవరణ బిల్లు ప్రవేశపెట్టబడగా, జీఎస్టీ బిల్లు మూజువాణీ ఓటుతో ఆమోదమైంది.

రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. ఎస్‌ఐఆర్‌పై వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంతో ప్రతిపక్షాలు వాకౌట్‌ చేశాయి. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం అదనంగా రూ.41వేల కోట్ల వ్యయం అవసరం అవుతుందని, దీనికి అనుమతించాలని కేంద్రం లోక్‌సభను కోరింది. ఇదిలాఉండగా, ప్రభుత్వ రంగ బ్యాంకులకు 15 మంది పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లు రూ.58వేల కోట్లు బాకీ ఉన్నారని కేంద్రం వెల్లడించింది.

విమానాశ్రయాల భద్రత అంశంపై కూడా కేంద్రం కీలక సమాచారం వెల్లడించింది. ఢిల్లీతో పాటు ముంబై, కోల్‌కతా, హైదరాబాద్‌, అమృత్‌సర్‌, బెంగళూరు, చెన్నై విమానాశ్రయాల్లో జీపీఎస్‌ స్పూఫింగ్‌ ఘటనలు జరిగినట్టు అంగీకరించింది. గ్లోబల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టంపై జోక్యం చేసుకునే ఘటనలు నమోదైందని కేంద్రం తెలిపింది.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now