శంషాబాద్‌ bound ఇండిగో విమానానికి బాంబ్ బెదిరింపు… ముంబైకి మళ్లింపు


TELANGANA, హైదరాబాద్: కువైట్‌ నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఇండిగో విమానానికి బాంబు పెట్టారనే ఇ-మెయిల్‌ హెచ్చరిక దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ అధికారులు మంగళవారం తెల్లవారుజామున అందుకున్నారు. వెంటనే పైలట్‌కు సమాచారం అందడంతో, శంషాబాద్‌లో ల్యాండ్‌ కావాల్సిన విమానాన్ని అత్యవసరంగా ముంబై వైపు మళ్లించారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అయిన వెంటనే ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించగా, విమానంలో అప్రమత్త చర్యలతో పాటు విస్తృత తనిఖీలు చేపట్టారు.


అసలు ఈ ఇండిగో విమానం ఉదయం 8.10 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాల్సి ఉంది. అయితే బాంబు బెదిరింపు కారణంగా ప్రయాణికులు, సిబ్బంది తీవ్ర ఉద్విగ్నానికి గురయ్యారు. ముంబై మరియు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ అధికారులు సంయుక్తంగా పరిస్థితిని సమీక్షిస్తున్నప్పటికీ ప్రయాణికులు, సిబ్బంది సంఖ్యను ఎయిర్‌లైన్స్‌ వెల్లడించలేదు.

ఇక దేశంలో ఇటీవలి కాలంలో ఇలాంటి నకిలీ బెదిరింపులు పెరుగుతున్న నేపథ్యంలో మరో ఘటన సోమవారం మహారాష్ట్రలో చోటుచేసుకుంది. థానే జిల్లాలోని ఒక పాఠశాలకు బాంబు బెదిరింపు రావడంతో విద్యాసంస్థ సిబ్బంది పోలీసులను అప్రమత్తం చేశారు. అధికారులు వెంటనే బృందాలతో చేరుకుని తనిఖీలు నిర్వహించగా ఎలాంటి పేలుడు పదార్థాలు కనుగొనబడలేదు.

దేశవ్యాప్తంగా పాఠశాలలు, విమానాశ్రయాలు, ఆసుపత్రుల వంటి ప్రజాస్థలాలను లక్ష్యంగా చేసుకుంటూ నకిలీ బెదిరింపులు పెరుగుతుండటంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బెదిరింపు కాల్స్‌పై కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now