జగన్ ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత.. అప్పటి వివక్షనేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాన్ని టార్గెట్ చేయటమే కాదు.. చంద్రబాబు ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయ్యిందన్న భావన కలిగేలా కార్యకలాపాల్ని నిర్వహించటం.. ఎంతలా వీలైతే అంతలా టార్గెట్ చేసిన వైనం తెలిసిందే. అన్నింటికి మించి స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్న సమయంలో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ జెండా ఎగరవేయటమే తప్పించి మరింకేమీ ఎజెండా లేదన్నట్లుగా వైసీపీ నేతలు అప్పట్లో వ్యవహరించారు.
అధినేత మనసు దోచుకోవటానికి కొందరు నేతలు చేసే అత్యుత్సాహపు పనులకు ప్రజలు ఎలా స్పందిస్తారన్నది చాలా ముఖ్యం. అధికారపార్టీ నేతలకు ఇలాంటివేమీ పట్టవు. ఎందుకంటే.. అధికారంలో ఉన్న ఏ పార్టీ నేత అయినా సరే.. తాము ఆకాశం నుంచి ఉడిపడినట్లుగా బిహేవ్ చేయటం మామూలే. అందుకు ఏ పార్టీకి మినహాయింపు లేదనే చెప్పాలి. అప్పట్లో వైసీపీ నేతల తీరు ఇలానే ఉండేది.
అందుకు తగ్గట్లే చంద్రబాబు సొంత నియోజకవర్గంలో అప్పటి అధికార పార్టీ జెండా ఎగిరితే.. అదో విజయంగా భావించటంలో అర్థం లేదనే చెప్పాలి. ఎందుకంటే.. అధికార బదిలీ అన్నది ప్రజల మైండ్ సెట్ లో వచ్చిన మార్పులతో రావాలే తప్పించి.. చేతిలో అధికార దండం ఉంది కాబట్టి అందరూ తమకు భయపడుతూ.. తాము కోరుకున్నది మాత్రమే జరగాలని ఆశిస్తున్నారు. ప్రజలు తమకు భయపడుతూ పనులు చేయాలనుకోవటం తప్పే అవుతుంది. అధికారపక్షానికి సంబంధించినంత వరకు ఉండే బలంతో తాము కోరుకున్నవన్నీ ఇట్టే జరిగిపోతుంటాయి.
ఇదే విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మిస్ అయినట్లు చెప్పాలి. అదే.. ఆయన చేసిన అతి పెద్దగా ఛెప్పాలి. ఎందుకంటే.. తమ పార్టీ నేతలు టీడీపీ అధిక్యతను తగ్గించటంలో సక్సెస్ అయినట్లుగా వైసీపీ అధినేత భావించారు. క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితి ఉందన్న విషయాన్ని గుర్తించలేదు. చంద్రబాబును టార్గెట్ చేశారని.. ఆయన్ను మానసికంగా కుంగదీసేందుకు ప్రభుత్వం తనకున్న సర్వాధికారాల్ని వినియోగిస్తుందన్న ప్రచారం జరిగింది.
దీంతో.. కుప్పం కోట మీద వైసీపీ జెండా ఎగరాలన్న అధికారపక్ష ఆకాంక్ష.. అత్యాశగా.. డెబ్బై ఏళ్ల పెద్ద మనిషికి దశాబ్దాలుగా అండగా ఉన్న ప్రాంతాన్ని అధికారంతో హస్తగతం చేసుకోవాలన్నట్లుగా ప్రజలు భావించటం మొదలైంది. ఈ పరిణామం మొత్తం చంద్రబాబుకు వ్యతిరేకంగా కాకుండా అనుకూలంగా మారటమేకాదు.. పెద్దఎత్తున సానుభూతిని తీసుకొచ్చింది. ఈ తీరు ఎవరికైనా వర్తిస్తుంది. తనకు చేటు చేయబోయిన వైసీపీ నేతల తీరు తనకు వరంగా మారిందన్న విషయాన్ని చంద్రబాబు గుర్తించారా? లేదా? అన్నది ప్రశ్న.
ఒకవేళ ఆయన గుర్తించి ఉంటే.. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కంచుకోటగా ఉండే పులివెందులలో జగన్ బలహీనపడ్డారన్న భావన కలిగేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్న తీరే దీనికి నిదర్శనం. తాను విపక్షంలో ఉన్నప్పుడు తనకు ఎదురైన పరిస్థితుల్నే.. తన తమ్ముళ్లు ఇప్పుడు జగన్ విషయంలోనూ అనుసరిస్తున్నారన్న విషయాన్నిసీఎం హోదాలో ఉన్న చంద్రబాబు గుర్తించారా? లేదా? ఒకవేళ గుర్తించి ఉంటే.. ఇప్పుడీ పరిస్థితి నెలకొని ఉండదన్న వాదనను కొట్టి పారేయలేం. తనకు సానుభూతి తెచ్చి పెట్టిన అంశాల్నే చంద్రబాబు సర్కారు సైతం జగన్ విషయంలో అనుసరిస్తున్న వైనాన్ని ఎవరో ఒకరు టీడీపీ అధినేతకు చెబితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
