ఖాకీ వర్సెస్ ఖధర్.. కోడిపై పట్టుకోసం హోరాహోరీ..


సైసై అంటున్న పందెంరాయుళ్లు, నైనై అంటున్న పోలీసులు...
వేగంగా సిధ్దం అవుతున్న పందెంబరులు...


సంక్రాంతి పండుగ స్పెసల్: సంక్రాంతి పండుగ సమీపిస్తుండగా ఉభయ గోదావరి, కోనసీమలో సాంప్రదాయం అనే ముసుగులో క్రూరత్వం, అక్రమ జూదం, భారీ డబ్బుల లావాదేవీలకు వేదిక సిద్ధమవుతోంది. కోళ్లకు పదునైన కత్తులు కట్టి, వాటిని రక్తపు రంగంలోకి నెట్టి, అవి ఒకదానికొకటి పోరాడి చావడం చూసి ఆనందిస్తున్న వికృత మనస్తత్వం సమాజంలో బహిరంగంగా ప్రదర్శితమవుతోంది. 

దీనికి తోడు గుండాటలు, పేకాటలు, భారీ పందెంరాయింపులతో ఇది ఐ.పి.ఎల్ తరహా వ్యాపార వేదికగా మారుతోంది. తణుకు, భీమవరం, ఏలూరు, అమలాపురం నియోజకవర్గ పరిధిలోని ఎస్.యానం ప్రాంతంలో గుండాటల నిర్వహణ హక్కులను 25 లక్షల రూపాయలకు వేలం వేసి కొనుగోలు చేసినట్లు సమాచారం. నిర్వాహకులు. ఎన్.కొత్తపల్లి గ్రామంలో ఈ మొత్తం 30 లక్షలకు చేరుకుంది. ఇవి కేవలం గుండాటల నిర్వహణ హక్కుల ధరలు మాత్రమే. 

వాస్తవ పందెం మొత్తాలు దీనికి మించి కోట్ల రూపాయలకు చేరే అవకాశం ఉంది. చిన్న చితకా బరులు, ప్రైవేట్ పందెం వేదికలు కలిపితే, ఈ సంక్రాంతి సీజన్‌లో కోనసీమ ప్రాంతంలోనే వందల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగే ప్రమాదం ఉంది. గ్రామాల నుండి నగరాల వరకు, చిన్న రైతు నుండి భారీ వ్యాపారవేత్తల వరకు ఈ జూదవలలో చిక్కుకుంటున్నారు. కోళ్లకు పదునైన ఉక్కు కత్తులు, బ్లేడ్లు కట్టి, వాటిను రింగ్‌లో పోరాడేలా చేయడం జంతు హింస నిరోధక చట్టం (Prevention of Cruelty to Animals Act, 1960) ప్రకారం తీవ్రమైన నేరం. 

రక్తం చిమ్మేలా పోరాడే ఈ కోళ్లు తీవ్ర బాధలో మరణిస్తుండగా, చుట్టూ నిలబడి ఆనందంతో కేరింతలు, కేకలు వేస్తున్న ప్రేక్షకుల మానసిక స్థితి ఆందోళనకరం. అయితే పోలీసు, మరియు రెవెన్యూ వ్యవస్థ, మాత్రం,  మేము చూడలేము, వినలేము, మాట్లాడలేము, అనే గాంధీ తాతయ్య మూడు కోతుల తత్వాన్ని విచిత్రంగా అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. కోడిపందాల నిర్వహణకు బహిరంగంగా లక్షల రూపాయలకు వేలం జరుగుతున్నా, వందల మంది గుమిగూడుతున్నా, సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతున్నా పోలీసు, రెవెన్యూ అధికారులకు కళ్లకు కనిపించడం లేదు, వారికి వినిపించడంలేదు. 

కానీ తోలుతీస్తాం, తాటితీస్తాం అని పోలీసులు ఇస్తున్న వార్నింగులు వింటుంటే నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనే ముతక సామెత గుర్తుచేసుకుంటున్నారు స్దానికులు. నాలుగు రాళ్లు వెనకేసుకోవడానికి పందెం నిర్వాహకులు, స్థానిక రాజకీయ నాయకులు, పోలీసు, రెవెన్యూ ఎలా వస్తుంది అధికారులకు ఇదే మంచి అవకాశంగా కనిపిస్తోంది. లేకపోతే 30 లక్షల రూపాయలు వేలంలో పెట్టే ధైర్యం నిర్వాహకులకు ఎలా వస్తుంది?. ఈ పందాలు, జూదాల వలన కొన్ని‌కుంటుబాంలు ఆర్థిక వినాశనం‌ జరుగుతుంది. 

అప్పుల ఊబిలో పడి ఆత్మహత్యలు వ్యవసాయ భూములు, నగలు, ఆస్తులు పందెంలో పోగొట్టుకుంటున్నారు. చిన్నారులు క్రూరత్వాన్ని సహజంగా చూడడం వల్ల హింస పట్ల సున్నితత్వం కోల్పోయీ అవకాశం ఉంది. అయితే ఇది మన సాంప్రదాయం, సంస్కృతి అని కొందరు లత్కోరులు వాదిస్తున్నారు. సాంప్రదాయం అంటే మానవత్వం, దయ, కరుణజీవహింస నివారణసమాజ సామరస్యంసాంస్కృతిక విలువల పరిరక్షణ కోడిపందాలు అంటే మూర్ఖత్వపు ప్రదర్శన‌క్రూరత్వానికి నిదర్శన, హింసాత్మక ఆచారాలను సాంప్రదాయం పేరిట కొనసాగించడం నాగరిక సమాజానికి అవమానం. 

సతీసహగమనం కూడా ఒకప్పుడు సాంప్రదాయంగా ఉండేది - మనం దానిని నిషేధించలేదా..?‌ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసు, రెవెన్యూ అధికారులు అసమర్థతపై పలు ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. పోలీసు విభాగం సమాధానం చెప్పాల్సిన అంశాలు ఇలా ఉన్నాయి. లక్షల రూపాయల వేలాలు బహిరంగంగా జరిగినా మీకు ఎందుకు తెలియలేదు..? సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతుండగా మీ సైబర్ సెల్ ఏం చేస్తోంది..?, జూదం, జంతు హింస నిరోధక చట్టాలను అమలు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం..?, 

వందల మంది గుమిగూడే కార్యక్రమాలపై ఎందుకు మీకు సమాచారం లేదు..?, పందాల నిర్వాహకులకు రక్షణ ఇస్తున్న శక్తులు ఎవరు.? పోలీసు-నిర్వాహకుల మధ్య అనధికారిక ఒప్పందాలు ఉన్నాయా..?,  రాజకీయ ప్రభావాలు స్థానిక నాయకుల ఒత్తిడి కారణంగా చర్య తీసుకోవడం లేదా..? ఎన్నికల ఫండ్స్ సేకరణకు ఈ పందాలు సాధనాలుగా మారాయా..? సుప్రీం కోర్టు, హై కోర్టుల ఆదేశాలను మీరు ఎందుకు పట్టించుకోడం లేదు..? అని స్దానికులు ప్రశ్నిస్తున్నారు. 

నిశ్శబ్దం కూడా నేరమే, ఉభయ గోదావరి, కోనసీమలో జరుగుతున్న ఈ అమానవీయ కార్యక్రమాలపై ప్రతి పౌరుడు స్పందించాల్సిన బాధ్యత ఉంది. పోలీసు వ్యవస్థ తన కర్తవ్యం నిర్వర్తించలేకపోతే, పౌరసమాజం, న్యాయవ్యవస్థ, మీడియా బలంగా నిలబడాలి. సంక్రాంతి పండుగ సంతోషానికి, ఆనందానికి మాత్రమే, రక్తానికి, క్రూరత్వానికి కాదు. జంతువుల పట్ల దయ లేని సమాజం మానవుల పట్ల కూడా దయ చూపదన్న నిజాన్ని గ్రహించి బాధ్యతగ చర్యలు తీసుకోవాలని ప్రజలు, మరియు జంతు ప్రేమికులు కోరుతున్నారు.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now