నిజామాబాద్ జిల్లా: డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జాతీయ జెండా రంగులు గాంధీ చెప్పుల కింద కనిపించడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనతో గ్రామ ప్రజల్లో ఆవేదన వ్యక్తమవుతోంది.
గ్రామ పంచాయతీ పరిధిలో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసే క్రమంలో జాతీయ జెండా రంగుల పట్ల తగిన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామ సెక్రటరీ, గ్రామ కారోబార్‌తో పాటు నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు ఈ అంశాన్ని గమనించకపోవడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
జాతీయ జెండా దేశ గౌరవానికి ప్రతీక కావడంతో, ఇటువంటి నిర్లక్ష్య చర్యలు జరగకూడదని గ్రామ ప్రజలు కోరుతున్నారు. బాధ్యత వహించాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

.jpeg)